YS Jagan: దొంగల ముఠా సభ్యులు చంద్రబాబును కాపాడుకుంటున్నారు.. ఏపీ సీఎం జగన్

AP CM YS Jagan Reaction On TDP Chief Chandrababu Arrest

  • దొంగతనం చేసినా దోపిడీ చేసినా ఆయనను నిస్సిగ్గుగా సమర్థిస్తున్నారని ఆరోపణ
  • ఆధారాలతో సహా అడ్డంగా దొరికినా వెనకేసుకు వస్తున్నారని విమర్శలు
  • చట్టం అందరికీ సమానమే అంటున్న గళాలు ఇప్పుడిప్పుడే గొంతు విప్పుకుంటున్నాయి
  • ప్రశ్నిస్తా.. ప్రశ్నిస్తా అన్నవాడు ప్రశ్నించడని మండిపడ్డ సీఎం

దోపిడీని రాజకీయంగా మార్చుకున్న టీడీపీ చీఫ్ చంద్రబాబు ఇటీవల ఆధారాలతో సహా పట్టుబడి జైలుకు వెళ్లారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ చెప్పారు. సాక్ష్యాలు, ఆధారాలతో దొరికినా సరే చంద్రబాబును కాపాడుకోవడానికి దొంగల ముఠా సభ్యులు సిద్ధమయ్యారని విమర్శించారు. నిడదవోలులో కాపునేస్తం నిధుల విడుదల కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి జగన్.. చంద్రబాబు అరెస్టుపై స్పందించారు. ఇటీవల అరెస్టు అయిన ఒక మహానుభావుడి గురించి నాలుగు మాటలు మాట్లాడతానంటూ మొదలు పెట్టి టీడీపీ అధినేతపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

ఎన్ని దొంగతనాలు చేసినా.. ఎన్ని దోపిడీలకు పాల్పడ్డా.. ఎన్ని వెన్నుపోట్లు పొడిచినా చంద్రబాబు నాయుడనే వ్యక్తిని రక్షించుకునేందుకు పలుకుబడి కలిగిన తన దొంగల ముఠా సభ్యులు ఉన్నారని జగన్ ఆరోపించారు. అంతేకానీ చట్టం ఎవరికైనా ఒకటే అని చెప్పేవారే ఇంతకాలం లేరని అన్నారు. అయితే, ఇటీవలి కాలంలో చట్టం అందరికీ సమానమేననే గొంతులు గళం విప్పుతున్నాయని జగన్ వివరించారు. ఓ మామూలు వ్యక్తి ఇదే నేరం చేస్తే ఎలాంటి శిక్ష పడుతుందో అధికారంలో ఉన్న వారికీ అదే శిక్ష పడాలని చెప్పే వారు పెరుగుతున్నారని అన్నారు. దొంగల ముఠా సభ్యులు దీనిని తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు.

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికినా కూడా, దోపిడీ సొమ్ము పంచుతూ పట్టుబడ్డా కూడా చంద్రబాబు చేసింది అసలు నేరమే కాదని వాదించడానికి ఆయన వాటాదారులు సిద్ధమయ్యారని జగన్ మండిపడ్డారు. చంద్రబాబు చేసిన దొంగతనాలలో ఈ పెద్ద మనుషులు కూడా వాటాదారులేనని ఆరోపించారు. వాటా ఉంది కాబట్టే చంద్రబాబును కాపాడుకోవడానికి, పది కోట్ల మంది ప్రజల కన్నుగప్పడానికి వారు ప్రయత్నించారని విమర్శించారు.

ఇంత అడ్డగోలుగా, బాహాటంగా దొరికినా కూడా ప్రశ్నిస్తా.. ప్రశ్నిస్తా అన్నవాడు ప్రశ్నించడని జగన్ అన్నారు. ఎల్లో మీడియా పత్రికలు, టీవీలు ప్రజలకు నిజాలను చూపెట్టవని మండిపడ్డారు. ఈ అక్రమాలపై నోరెత్తకపోగా నిస్సిగ్గుగా ఆయన చేసిన పనులు సబబేనని చెబుతారంటూ ఫైర్ అయ్యారు. మనం ఎలాంటి ప్రపంచంలో బతుకుతున్నాం.. ఎవరి వైపు నిలబడాలో మీరే నిర్ణయించుకోవాలని ప్రజలకు సీఎం జగన్ సూచించారు.

  • Loading...

More Telugu News