Asaduddin Owaisi: కశ్మీర్ ఎన్ కౌంటర్ తో భారత్-పాక్ మ్యాచ్ కు ముడివేసి కీలక వ్యాఖ్యలు చేసిన ఒవైసీ

Owaisi questions Center on Anantanaag encounter

  • కశ్మీర్ లోని అనంతనాగ్ జిల్లాలో నాలుగు రోజులుగా కాల్పులు
  • భారత్ కు తీవ్ర నష్టం... ముగ్గురు సైనికాధికారుల వీరమరణం
  • వచ్చే నెలలో భారత్-పాక్ వరల్డ్ కప్ మ్యాచ్
  • ఆ మ్యాచ్ కు ముందే కశ్మీర్ లో బుల్లెట్ల ఆటలను ఆపాలన్న ఒవైసీ

కశ్మీర్ లోని అనంతనాగ్ లో జరిగిన భారీ ఎన్ కౌంటర్ లో ముగ్గురు సైనికాధికారులు వీరమరణం పొందడం తెలిసిందే. గత నాలుగు రోజులుగా అక్కడ కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. కోకెర్ నాగ్ సమీపంలోని గడోలే అటవీప్రాంతంలో ఎత్తయిన కొండల్లో గుబురుగా ఉన్న చెట్ల మాటున దాగిన టెర్రరిస్టులు... సెర్చ్ ఆపరేషన్ కు వచ్చిన భారత సైనిక బలగాలను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరుపుతున్నారు. 

ఈ కాల్పుల్లో ముగ్గురు సైనికాధికారులను కోల్పోవడం ద్వారా భారత్ కు భారీ నష్టం జరిగిన నేపథ్యంలో, ఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ తీవ్రంగా స్పందించారు. ఈ బుల్లెట్ల ఆటను ఆపేలా కేంద్రం కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో వచ్చే నెలలో భారత్-పాక్ జట్లు వరల్డ్ కప్ మ్యాచ్ లో తలపడనుండగా, ఆ మ్యాచ్ కంటే ముందే రాజౌరీలో కశ్మీరీ పండిట్లతో, భారత సైనికులతో టెర్రరిస్టులు ఆడుతున్న బుల్లెట్ల మ్యాచ్ కు చరమగీతం పాడాల్సిన అవసరం ఉందని ఒవైసీ స్పష్టం చేశారు. 

బీజేపీ నాయకత్వంలోని కేంద్రం ఏంచేస్తోంది... అనంతనాగ్ జిల్లాలో భారత సైనికుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం మౌనంగా ఉండడం దేనికి సంకేతం? అని నిలదీశారు. 

కశ్మీర్ పట్ల కేంద్రం అనుసరిస్తున్న విధానం విఫలం కావడం వల్లే టెర్రరిస్టులు బుల్లెట్ల ఆటకు తెరదీశారని ఒవైసీ విమర్శించారు. అనంతనాగ్ జిల్లాలో భారత సైనికులు జీవితాలు ముగిసిపోతున్నాయి... మోదీ స్టేడియంలో భారత్-పాక్ మ్యాచ్ నిర్వహిస్తారా? అని ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News