Prashant Kishor: ఓటుకు డబ్బులు ఇచ్చినవాడే రేపు ఉచిత పథకాలకు ప్రజల నుంచి డబ్బు వసూలు చేస్తాడు: ప్రశాంత్ కిశోర్
- ఓటర్లు, నేతలపై ప్రశాంత్ కిశోర్ ఆసక్తికర వ్యాఖ్యలు
- ఓటును అమ్ముకునే ప్రజలు అవినీతిపరులేనని వెల్లడి
- ఓటును కొనుక్కునే నేత కూడా అవినీతిపరుడేనని వ్యాఖ్యలు
ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓటును అమ్ముకునే వారు అవినీతిపరులేనని, అలాంటి అవినీతిపరుల ఓట్లతో గెలిచిన నేతను హరిశ్చంద్రుడు అని ఎలా అంటామని అన్నారు. ఓటరు అవినీతిపరుడైతే, ఓటును కొనుక్కునే రాజకీయ నేత కూడా అవినీతిపరుడేనని పేర్కొన్నారు.
ఓటుకు డబ్బులు ఇచ్చిన నేతలే, రేపు గెలిచాక ఉచిత ప్రభుత్వ పథకాలకు ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తారని ప్రశాంత్ కిశోర్ వెల్లడించారు. యథా ప్రజా తథా నేత అని స్పష్టం చేశారు.
ప్రజలే అవినీతిపరులైతే నేతల నుంచి నీతిని ఎలా ఆశించగలమని ప్రశ్నించారు. మీరు ఓటును రూ.500కి అమ్ముకుంటారు... మీ గౌరవాన్ని మీ నేత రూ.5 వేలకు అమ్ముకుంటాడు... అంతే తేడా! అని వివరించారు. బిర్యానీకి, మద్యం సీసాలకు ఓటును అమ్ముకునేవారికి నేతలను ప్రశ్నించే అధికారం ఉండదని అన్నారు. ప్రశాంత్ కిశోర్ ఏపీ అధికార పక్షం వైసీపీకి ఎన్నికల వ్యూహకర్త అని తెలిసిందే.