Tirumala: చిన్నారి లక్షితను పొట్టనపెట్టుకున్న చిరుత ఇంకా చిక్కలేదా..?
- ఇప్పటివరకూ తిరుమలలో చిక్కిన నాలుగు చిరుతలు
- రెండింటికి పరీక్షలు జరపగా అవి మాన్ ఈటర్లు కావని తేలిన వైనం
- మరో రెండు చిరుతల్లో ఒకదానికి కోరలు లేకపోగా రెండోది పసికూన
- దీంతో, లక్షితను బలిగొన్న చిరుత ఇంకా చిక్కలేదని అంటున్న అధికారులు
తిరుమల కాలినడక మార్గంలో చిరుత దాడుల నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు ఇప్పటివరకూ నాలుగు చిరుతలను అదుపులోకి తీసుకున్నారు. మరి చిన్నారి లక్షితను పొట్టనపెట్టుకున్న చిరుత దొరికిందా? అంటే లేదనే అధికారులు సమాధానం ఇస్తున్నారు. ఇప్పటివరకూ పట్టుబడ్డ చిరుతల్లో రెండింటికి డీఎన్ఏ పరీక్షలు నిర్వహించగా అవి మ్యాన్ఈటర్లు (నరమాంసం రుచిమరిగినవి) కావని తేలింది. దీంతో, అధికారులు వాటిని శీశైలం అడవుల్లో విడిచిపెట్టారు. మిగతా రెండింటి పరీక్షల ఫలితాలు రావాల్సి ఉంది. అయితే, వీటిల్లో ఒకదానికి దంతాలు లేకపోగా మరొకటి పూర్తిగా పసికూన. కాబట్టి అవి మాన్ఈటర్లు అయ్యే అవకాశం చాలా తక్కువని అధికారులు చెబుతున్నారు.
తొలుత అలిపిరి కాలిబాటలో ఓ చిరుత బాలుడిపై దాడి చేయడంతో అధికారులు దాన్ని బోనులో బంధించారు. కొన్ని రోజుల పాటు దాన్ని జూలో సంరక్షించి ఆ తరువాత పరీక్షలు నిర్వహించకుండానే అడవిలో విడిచిపెట్టారు. ఆ తరువాత నెలరోజుల్లోనే అలిపిరి కాలిబాటలో చిన్నారి లక్షితను చిరుత బలితీసుకుంది. దీంతో, ఈ రెండు దాడుల వెనుకా ఒకే చిరుత ఉందన్న అనుమానాలు బయలుదేరాయి. ఒకసారి మనిషి మాంసం రుచిమరిగిన జంతువు వరుసదాడులు చేస్తుందని అటవీ శాఖ వర్గాలు చెబుతున్నాయి. దీంతో, మ్యాన్ఈటర్ చిరుత ఏమైందన్న ప్రశ్నకు సమాధానం దొరకాల్సి ఉంది.