Finance Minister: వేరే మతాలపై మాట్లాడే దమ్ము ఉదయనిధికి ఉందా?: మంత్రి సీతారామన్
- రాజ్యాంగం ప్రకారం చేసిన ప్రమాణం మర్చిపోయారా? అని ప్రశ్న
- ఒక మతాన్ని నిర్మూలిస్తామని చెప్పే హక్కు లేదన్న కేంద్ర మంత్రి
- ఆలయాలను ఎలా పరిరక్షిస్తారు? అంటూ తమిళనాడు మంత్రికి ప్రశ్న
తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలు ప్రజల మనోభావాలను గాయపరిచేలా ఉన్నాయంటూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆందోళన వ్యక్తం చేశారు. హిందువులు పాటించే సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు ఎంతో మంది తప్పుబట్టడం గుర్తుండే ఉంటుంది. డెంగీ, మలేరియా, ఎయిడ్స్ వ్యాధులతో సనాతన ధర్మాన్ని పోలుస్తూ, దాన్ని నిర్మూలించాలని ఉదయనిధి వ్యాఖ్యానించారు. తన వ్యాఖ్యలపై కనీసం ఆయన పశ్చాత్తాపం కూడా వ్యక్తం చేయలేదు.
దీనిపై పెద్ద వివాదం నెలకొన్న నేపథ్యంలో మంత్రి సీతారామన్ స్పందించారు. ‘‘నీవు (ఉదయనిధి స్టాలిన్) రాజ్యాంగం ప్రకారం ప్రమాణ స్వీకారం చేసి మంత్రి పదవి తీసుకున్నావు. ప్రమాణ స్వీకారం సమయంలో ఎవరి మనోభావాలను గాయపరచనంటూ స్పష్టంగా చెప్పావు. అది నీ భావజాలమే అయినా, ఒక మతాన్ని నిర్మూలిస్తానంటూ చెప్పే హక్కు నీకు లేదు’’అని సీతారామన్ అన్నారు. చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమంలో భాగంగా మంత్రి సీతారామన్ దీనిపై మాట్లాడారు. ఇదే వేదికపై ఉన్న తమిళనాడు హిందూ మత, సామాజిక సేవా విరాళాల మంత్రి పి.శేఖర్ బాబును కేంద్ర మంత్రి నిలదీశారు.
‘‘మీరు ఆలయాలను ఎలా పరిరక్షిస్తారు? వాటిని నిర్మూలిస్తామంటూ ఒకరు మాట్లాడుతున్నప్పుడు? మీరు కూడా రాజ్యాంగం ప్రకారం ప్రమాణం చేసి.. సనాతన హిందువులు ఆలయ హుండీల్లో వేస్తున్న నిధులను తీసుకుంటున్నారుగా?’’అని మంత్రి సీతారామన్ తమిళనాడు మంత్రి శేఖర్ బాబును ప్రశ్నించారు. ఉదయనిధి తల తెచ్చిస్తే రూ.10 కోట్లు ఇస్తామని ఓ సన్యాసి చేసిన ప్రకటనను సైతం మంత్రి సీతారామన్ తప్పుబట్టారు. హింసకు తావు లేదన్నారు.
సనాతన ధర్మంపై ఇలాంటి ద్వేషపూరిత ప్రసంగాలు ఎక్కువయ్యాయంటూ.. హిందువుల ప్రతీకారంతో వ్యవహరించపోవడం వల్లేనన్నారు. అదే తరహాలో ఇతర మతాలపై మాట్లాడేంత వెన్ను వారికి లేదన్నారు. ‘‘అలా మాట్లాడతారేమో చూద్దాం. ఇతర మతాల్లో ఎలాంటి సమస్యలు లేవా? ఇతర మతాల్లో మహిళలను కించపరచడం లేదా? దానిపై మాట్లాడే ధైర్యం మీకు ఉందా?’’అని మంత్రి సీతారామన్ నిలదీశారు.