Siemens: ‘స్కిల్’ కేసు పూర్తిగా నిరాధారమే: సీమెన్స్ మాజీ ఎండీ

Siemens Company Former MD Suman Bose Press Meet

  • ప్రాజెక్టు ఫలితాలు మన కళ్లముందే ఉన్నాయన్న సుమన్ బోస్
  • గతంలో ఏపీఎస్ఎస్ డీసీ ఎండీ కూడా మెచ్చుకున్నారని వివరణ
  • అత్యంత విజయవంతమైన ప్రాజెక్టని కితాబిచ్చారని వెల్లడి

ఆంధ్రప్రదేశ్ లోని విద్యార్థుల నైపుణ్యాన్ని మెరుగుపరిచి, ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా వారిని తీర్చిదిద్దే లక్ష్యంతోనే స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్టుకు రూపకల్పన చేశామని సీమెన్స్ కంపెనీ మాజీ ఎండీ సుమన్ బోస్ పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు ఉద్దేశం విద్యార్థుల నైపుణ్యాలు మెరుగు పరచడమే తప్ప ఉత్పత్తులు తయారు చేయడం కాదని వివరించారు. ప్రాజెక్టులో భాగంగా దేశంలో 200 లకు పైగా ల్యాబ్ లను ప్రారంభించినట్లు వివరించారు. 2021 వరకు 2.13 లక్షల మంది విద్యార్థులు శిక్షణ పూర్తిచేసుకున్నారని, వారిలో ఇప్పుడు చాలామంది మంచి ఉద్యోగాలలో ఉన్నారని వివరించారు. స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్టుపై అవినీతి ఆరోపణలు, చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో సుమన్ బోస్ ఆదివారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్టుకు సంబంధించి పలు వివరాలను వెల్లడించారు.

స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్టును గతంలో ఏపీఎస్ఎస్ డీసీ ఎండీ కూడా మెచ్చుకున్నారని సుమన్ బోస్ చెప్పారు. అలాంటిది ఇప్పుడు అదే ఏపీఎస్ఎస్ డీసీ ఇలాంటి ఆరోపణలు ఎలా చేస్తోందనేది తనకు అంతుపట్టడంలేదన్నారు. స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్టు ఫలితాలు మన కళ్లముందే ఉన్నాయని ఆయన గుర్తుచేశారు. స్కిల్ కేసుపై చేస్తున్న ఆరోపణలన్నీ నిరాధారమేనని స్పష్టం చేశారు. అవినీతి జరిగిందని ఆరోపణలు వచ్చినపుడు సరైన విచారణ జరిపాక కేసు పెట్టాల్సి ఉండగా.. కేసు పెట్టడం కోసమే ఈ విషయంలో ఆరోపణలు చేసినట్లు ఉందని అన్నారు. ఒక్క శిక్షణా కేంద్రాన్ని కూడా సందర్శించకుండా ఆరోపణలు నిజమని ఎలా తేల్చేస్తారని ప్రశ్నించారు.

స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్టుకు సంబంధించి సీమెన్స్ మాజీ ఎండీ వెల్లడించిన వివరాలు..
  • ఈ ప్రాజెక్టు బిల్ట్ -ఆపరేట్ -ట్రాన్స్ ఫర్ పద్ధతిలో చేపట్టామని సుమన్ బోస్ పేర్కొన్నారు.
  • 2021 లో ప్రాజెక్టును, శిక్షణ కేంద్రాలను ప్రభుత్వానికి అప్పగించినట్లు తెలిపారు.
  • 2016లోనే ఈ ప్రాజెక్టుపై కేంద్రం ప్రశంసలు కురిపించింది. ఇదొక కేస్ స్టడీగా ఉపయోగపడుతుందని మెచ్చుకుందన్నారు.
  • ఆ తర్వాత అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి.. వాటిపై మాకు సమాచారం లేదని వివరించారు.
  • 2018లో ఈ ప్రాజెక్టు నుంచి తాను తప్పుకున్నానన్న సుమన్ బోస్.. తనపైనా ఇతరులపైనా తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
  • ప్రాజెక్టులో అధిక భాగం సీమెన్స్ సంస్థ నుంచి డిస్కౌంట్స్ రూపంలోనే అందింది. డిస్కౌంట్స్ లో అవినీతి ఎలా సాధ్యమని ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News