TDP MPs: చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ పార్లమెంట్ లో టీడీపీ ఎంపీల ధర్నా
- పార్టీ ఎంపీలతో కలిసి పాల్గొన్న నారా లోకేశ్
- ప్లకార్డులతో గాంధీ విగ్రహం ముందు ఆందోళన
- ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని నినాదాలు
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అరెస్టుపై సోమవారం పార్లమెంట్ ఆవరణలో టీడీపీ ఎంపీలు ధర్నా చేపట్టారు. ప్లకార్డులు చేతబట్టి, గాంధీ విగ్రహం ముందు నిరసన తెలుపుతూ.. ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యాన్ని రక్షించాలంటూ నినాదాలు చేశారు. ప్రస్తుతం ఢిల్లీలోనే ఉన్న టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ పార్లమెంట్ కు చేరుకుని ఎంపీలతో కలిసి ఈ ధర్నాలో పాల్గొన్నారు. టీడీపీ మాజీ ఎంపీలు కూడా ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. చంద్రబాబు అరెస్టును తీవ్రంగా ఖండించారు. ఆయనపై నమోదు చేసిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా ఎంపీ రఘురామకృష్ణ రాజు మాట్లాడుతూ.. ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టుకు నిరసనగా మహాత్ముడి విగ్రహం ముందు పార్టీలకు అతీతంగా ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఏపీలో ప్రజాస్వామ్యాన్ని ఎలా అణచివేస్తున్నారో దేశం మొత్తానికీ తెలియజెప్పేందుకే ఈ ధర్నా చేపట్టామన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా, ఏపీలో జరుగుతున్న పరిణామాలను దేశ ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నామని ఎంపీ గల్లా జయదేవ్ తెలిపారు. మచ్చలేని నాయకుడు చంద్రబాబుపై రాజకీయ కక్ష సాధింపు చర్యలను ఖండిస్తున్నట్లు ఎంపీ కేశినేని వ్యాఖ్యానించారు.