G. Kishan Reddy: విభజనపై ప్రధాని మోదీ వ్యాఖ్యలు... కిషన్ రెడ్డి వివరణ!
- ప్రధాని మోదీ ఎవరినీ విమర్శించలేదన్న కిషన్ రెడ్డి
- విభజన సమయంలో పార్లమెంట్ సాక్షిగా నిలిచిన అంశాలనే ప్రస్తావించారని వెల్లడి
- ఆనాడు పెప్పర్ స్ప్రే ఉపయోగించలేదా, పార్లమెంట్ తలుపులు మూయలేదా? అన్న కిషన్ రెడ్డి
పార్లమెంట్లో ప్రధాని నరేంద్రమోదీ రాష్ట్ర విభజనపై చేసిన వ్యాఖ్యల పట్ల బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. మోదీ ఎవరినీ విమర్శించలేదని స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంట్ సాక్షిగా నిలిచిన అంశాలనే ఆయన ప్రస్తావించారని స్పష్టం చేశారు. విభజన సమయం ఎపిసోడ్లో పెప్పర్ స్ప్రేను వాడలేదా? పార్లమెంట్ తలుపులు మూయలేదా? అని ప్రశ్నించారు. పార్లమెంట్ భవనం చరిత్ర గురించి చెబుతూ ప్రధాని ఆ విషయాలను గుర్తు చేశారన్నారు. కేసీఆర్ కుటుంబం ఏదీ అర్థం చేసుకునే పరిస్థితిలో లేదన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం... నీళ్లు, నిధులు, నియామకాలు అనే తెలంగాణ లక్ష్యాన్ని దెబ్బతీసిందన్నారు. గతంలో ఇదే బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీతో అధికారం పంచుకుందన్నారు. ఆ సమయంలో కాంగ్రెస్ తెలంగాణను ఆలస్యం చేసిందని ఆరోపించారు. తెలంగాణను కాంగ్రెస్ ఇచ్చిందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారని, కానీ కాంగ్రెస్ను దంచి ప్రజలు తెలంగాణను తెచ్చుకున్నారన్నారు. అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ మెడలు వంచి, తెలంగాణను సాధించారన్నారు.