lic: ఎల్ఐసీ ఏజెంట్లకు, ఉద్యోగులకు కేంద్రం అదిరిపోయే న్యూస్!
- గ్రాట్యుటీ, ఫ్యామిలీ పెన్షన్‌కు సంబంధించి ప్రయోజనాలు
- వీటికి ఆమోదం తెలిపిన కేంద్ర ఆర్థిక శాఖ
- లక్షలాది మంది ఉద్యోగులు, ఏజెంట్లకు ప్రయోజనం
ఎల్ఐసీ ఉద్యోగులు, ఏజెంట్లకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గ్రాట్యుటీ, ఫ్యామిలీ పెన్షన్‌కు సంబంధించి కొన్ని ప్రయోజనాలు అందించేందుకు కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. ఈ మేరకు సోమవారం ప్రకటన విడుదల చేసింది. దీంతో లక్షలాది మంది ఏజెంట్లు, ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది.
ఏజెంట్లకు అందిస్తోన్న గ్రాట్యుటీ మొత్తాన్ని రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంపుదల చేసినట్టు తెలిపింది. రీ-అపాయింట్ అయిన ఏజెంట్లకు రెన్యూవల్ కమీషన్‌కు అర్హత కల్పిస్తున్నట్లు వెల్లడించింది. ఏజెంట్లకు టర్మ్ ఇన్స్యూరెన్స్ కవరేజీ ఇప్పటి వరకు రూ.3 వేల నుంచి రూ.10వేలు ఉండగా, ఇప్పుడు దాన్ని రూ.25వేల నుంచి రూ.1.50 లక్షలకు పెంచింది.
అంతేగాకుండా, ఎల్ఐసీ ఉద్యోగుల కుటుంబాలకు సంక్షేమం అందించేందుకు గాను అందరికీ ఒకే తరహా 30 శాతం ఫ్యామిలీ పెన్షన్ కింద ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈ నిర్ణయంతో 13 లక్షలకు పైగా ఎల్ఐసీ ఏజెంట్లకు, ఒక లక్షకు పైగా ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతుంది.