GSB Seva Mandal: ఈ ముంబయి గణేశుడికి కళ్లు చెదిరే బీమా
- నేడు వినాయకచవితి
- ముంబయిలో ఖరీదైన వినాయకుడ్ని ప్రతిష్టించిన జీఎస్బీ సేవా మండల్
- రూ.360 కోట్లతో గణేశ్ మండపానికి బీమా
- 66.5 కిలోల బంగారం, 295 కిలోల వెండితో వినాయక విగ్రహం
ఇవాళ వినాయక చవితి. దేశవ్యాప్తంగా గణేశ్ చతుర్థి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. కొన్ని చోట్ల ప్రత్యేకమైన రీతిలో గణేశుడి విగ్రహాలు ఏర్పాటు చేయడం ఎప్పటినుంచో ఉంది. కరెన్సీ నోట్లతో, డ్రైఫ్రూట్లతో, నగలతో వినాయకుడ్ని అలంకరించడం తెలిసిందే.
ఇక అసలు విషయానికొస్తే... ముంబయిలో జీఎస్బీ సేవా మండల్ ఏర్పాటు చేసిన వినాయకుడి గురించి తెలిస్తే ఔరా అంటారు. ఈ వినాయక మండపానికి కళ్లు చెదిరే రీతిలో రూ.360 కోట్లతో బీమా చేయించారు. అందుకు కారణం ఉంది. ఇక్కడి గణేశుడి విగ్రహాన్ని 66.5 కిలోల బంగారం, 295 కిలోల వెండితో రూపొందించారు.
భద్రతాపరంగానూ ఈ మండపం వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఎక్కడా లేని విధంగా ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ కలిగిన కెమెరాలను ఏర్పాటు చేశారు. గతేడాది కూడా జీఎస్బీ సేవా మండల్ వినాయకుడికి రూ.316 కోట్లకు బీమా చేశారు. ఈ ఏడాది 69వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఘనంగా ఏర్పాట్లు చేశారు.