Chandra Shekhar: తనను మార్కెట్లో అమ్మకుండా చూడాలని రాముడు నా కలలోకి వచ్చి చెప్పాడు: బీహార్ మంత్రి
- మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీహార్ మంత్రి చంద్రశేఖర్
- రామచరిత మానసను ఇటీవల పొటాషియం సైనేడ్‌తో పోల్చిన మంత్రి
- మండిపడుతున్న బీజేపీ
- అవి ఆయన వ్యక్తిగత వ్యాఖ్యలన్న సొంతపార్టీ జేడీయూ
బీహార్ విద్యాశాఖమంత్రి చంద్రశేఖర్ మరోమారు వివాదంలో కూరుకున్నారు. శ్రీరాముడు తన స్వప్నంలోకి వచ్చి మార్కెట్లో తనను విక్రయించకుండా రక్షించాలని వేడుకున్నట్టు తెలిపారు. ‘‘రాముడు నా కలలోకి వచ్చాడు. ప్రజలు నన్ను బజార్లో అమ్మేస్తున్నారు. అలా విక్రయించకుండా నన్ను కాపాడు’’ అని తనతో చెప్పినట్టు రాంపూర్ గ్రామంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పేర్కొన్నారు. రామచరిత మానసను మంత్రి ఇటీవల పొటాషియం సైనేడ్‌తో పోల్చారు. అంతలోనే ఇప్పుడు మరోమారు రాముడిపై చేసిన ఈ వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
దేశంలోని కుల వ్యవస్థ గురించి మంత్రి చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ‘‘శబరి ఎంగిలి చేసిన పండ్లను రాముడు తిన్నాడు. కానీ ఈ రోజు శబరి కుమారులను ఆలయాల్లోకి రానివ్వడం లేదు. చివరికి రాష్ట్రపతి, ముఖ్యమంత్రులను కూడా అడ్డుకుంటున్నారు. ఆలయాలను గంగాజలంతో శుద్ధి చేశారు. శబరి ఇచ్చిన ఆహారాన్ని రాముడు తిన్నాడు. ఆయన కూడా కులవ్యవస్థపై అసంతృప్తి వ్యక్తం చేశాడు’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా మండిపడుతోంది. మరోవైపు, ఆయన సొంతపార్టీ జేడీయూ స్పందించింది. అవి ఆయన వ్యక్తిగత వ్యాఖ్యలని, పార్టీకి సంబంధం లేదని పేర్కొంది.