Andhra Pradesh: చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై నేడు విచారణ
- రిమాండ్ ఉత్తర్వులు కొట్టేయాలంటూ హైకోర్టులో టీడీపీ చీఫ్ పిటిషన్
- ‘స్కిల్’ కేసులో నేడు కీలక విచారణలు
- ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్ పైనా ఈ రోజే విచారణ
స్కిల్ డెవలప్ మెంట్ కేసుకు సంబంధించి మంగళవారం న్యాయస్థానాల్లో కీలక విచారణలు జరగనున్నాయి. ఏసీబీ కోర్టు తీర్పుపై టీడీపీ అధినేత చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. తనకు రిమాండ్ విధించడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. చంద్రబాబు అరెస్టు చట్టవిరుద్ధమని, ఆయన రిమాండ్ ఉత్తర్వులను కొట్టివేయాలని లాయర్ సిద్ధార్థ లూథ్రా వాదిస్తున్నారు. ఈ పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు.. కౌంటర్ దాఖలు చేసేందుకు ప్రభుత్వానికి ఈ నెల 18 వరకు సమయం ఇచ్చింది.
విచారణను మంగళవారానికి (ఈ నెల 19) వాయిదా వేసింది. నేడు ఈ పిటిషన్ పై హైకోర్టు విచారించనుంది. కాగా, ఏసీబీ న్యాయస్థానంలో చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పైన, తమ కస్టడీకి అప్పగించాలని సీఐడీ వేసిన పిటిషన్ పైన కూడా మంగళవారమే విచారణ జరగనుంది. క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ పూర్తయిన తర్వాతే సీఐడీ కస్టడీ పిటిషన్ ను కోర్టు విచారించనుంది.