Gutta sukhender: మరోసారి విషం కక్కారంటూ మోదీ వ్యాఖ్యలపై గుత్తా ఫైర్
- రాష్ట్ర విభజనపై మోదీ వ్యాఖ్యలను తప్పుబట్టిన తెలంగాణ శాసన మండలి చైర్మన్
- బీజేపీపై విమర్శలు గుప్పించిన బీఆర్ఎస్ లీడర్
- రాష్ట్ర ఉద్యమంలో బీజేపీ పాత్ర లేదని ఆరోపణ
ఆంధ్రప్రదేశ్ విభజన సరిగా జరగలేదంటూ పార్లమెంట్ లో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణపై ప్రధాని మోదీ మరోసారి విషం కక్కారంటూ ఫైర్ అయ్యారు. రాష్ట్రంపై కేంద్రానికి చిన్నచూపు ఉందని ఆరోపించారు. ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమంలో బీజేపీ పాత్ర లేదని, ఆ పార్టీ నేతలు తమ పదవులకు రాజీనామా చేయలేదంటూ కిషన్ రెడ్డి ఉదంతాన్ని ప్రస్తావించారు.
తెలంగాణ నేతలంతా తమ పదవులకు రాజీనామా చేసి ఉద్యమంలో భాగమైతే కిషన్ రెడ్డి మాత్రం తన పదవిని వదులుకోలేదని విమర్శించారు. తమ ప్రజా వ్యతిరేక విధానాలను కప్పిపుచ్చుకోవడానికి కేంద్ర ప్రభుత్వంలోని బీజేపీ మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకొస్తోందని ఆరోపించారు.
తెలంగాణ ప్రజలను మభ్య పెట్టేందుకు ప్రయత్నిస్తోందని గుత్తా సుఖేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. హైదరాబాద్ లో జరిగిన ఆ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశాల్లో ఆచరణలో సాధ్యం కానీ హామీలు ఇచ్చారని అన్నారు. తెలంగాణ ప్రజలకు ప్రకటించిన ఆరు హామీలను కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు అమలు చేయడంలేదని ఆ పార్టీ నేతలను గుత్తా నిలదీశారు.