Rajinikanth: రజనీకాంత్ ను వరల్డ్ కప్ కు ఆహ్వానిస్తూ బీసీసీఐ 'గోల్డెన్ టికెట్'
- ఐసీసీ వరల్డ్ కప్ కు ఆతిథ్యమిస్తున్న భారత్
- అక్టోబరు 5 నుంచి నవంబరు 19 వరకు మెగా టోర్నీ
- వివిధ రంగాల ప్రముఖులకు గోల్డెన్ టికెట్ ఇస్తున్న బీసీసీఐ
- ఇప్పటికే అమితాబ్ బచ్చన్, సచిన్ టెండూల్కర్ లకు గోల్డెన్ టికెట్
- తాజాగా చెన్నైలోని రజనీ నివాసానికి వెళ్లిన బీసీసీఐ కార్యదర్శి జై షా
భారత్ లో అక్టోబరు 5 నుంచి ఐసీసీ వరల్డ్ కప్ ఈవెంట్ జరగనున్న సంగతి తెలిసిందే. 2011 తర్వాత భారత్ వన్డే వరల్డ్ కప్ కు ఆతిథ్యమిస్తోంది. ఈ మెగా టోర్నీని గ్రాండ్ సక్సెస్ చేయాలని బీసీసీఐ ఘనంగా ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో, మునుపెన్నడూ లేని విధంగా దేశంలోని వివిధ రంగాల ప్రముఖులను వరల్డ్ కప్ కు ఆహ్వానిస్తూ బీసీసీఐ గోల్డెన్ టికెట్ బహూకరిస్తోంది.
ఈ గోల్డెన్ టికెట్ వీఐపీ పాస్ వంటిది. దీంతో వరల్డ్ కప్ టోర్నీలోని ఏ మ్యాచ్ నైనా స్టేడియానికి వచ్చి వీఐపీ గ్యాలరీ నుంచి వీక్షించవచ్చు. ఇప్పటివరకు ఈ గోల్డెన్ టికెట్ ను బిగ్ బి అమితాబ్ బచ్చన్, క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ లకు బీసీసీఐ అందించింది.
తాజాగా ఈ గోల్డెన్ టికెట్ ను దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ కు కూడా బహూకరించారు. బీసీసీఐ కార్యదర్శి జై షా చెన్నైలోని రజనీ నివాసానికి వచ్చి స్వయంగా తలైవాకు అందించారు. రజనీకాంత్ ను ఓ విశిష్ట అతిథిగా భావిస్తూ వరల్డ్ కప్ కు ఆహ్వానించినట్టు బీసీసీఐ వెల్లడించింది.
తన రాకతో వరల్డ్ కప్ నిర్వహణకు తలైవా వన్నె తెస్తారని ఆశిస్తున్నట్టు పేర్కొంది. రజనీకాంత్ భాషాసంస్కృతులకు అతీతంగా లక్షలాది మంది హృదయాలపై చెరగని ముద్రవేశారని బీసీసీఐ కొనియాడింది. నికార్సయిన సినీ తేజోస్వరూపం, నట దిగ్గజం అంటూ తలైవాను కీర్తించింది.