Qin Gang: చైనా మాజీ విదేశాంగ మంత్రి తొలగింపు వెనక సంచలన కారణం.. సంచలనం రేపుతున్న ‘వాల్‌స్ట్రీట్ జర్నల్’ కథనం
- జులైలో పదవీచ్యుతుడైన క్విన్ గాంగ్
- అమెరికాలో రాయబారిగా ఉన్నప్పుడు నెల రోజులపాటు అదృశ్యం
- అక్కడ వివాహేతర సంబంధం కొనసాగింపు
- ఓ బిడ్డకు కూడా జన్మనిచ్చినట్టు కథనం
జులైలో పదవీచ్యుతుడైన చైనా విదేశాంగ మంత్రి క్విన్ గాంగ్ సంబంధించి సంచలన విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆయన అమెరికాలో రాయబారిగా ఉన్నప్పుడు వివాహేతర సంబంధం కలిగి ఉన్నట్టు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ‘వాల్‌స్ట్రీట్ జర్నల్’ నిన్న ప్రచురించిన కథనం సంచలనమైంది. క్విన్ విచారణకు సహకరించినట్టు తెలిపింది. మరోవైపు, క్విన్ వివాహేతర సంబంధం కానీ, ఆయన ప్రవర్తన కానీ చైనా జాతీయ భద్రతకు ఏమైనా విఘాతం కలిగించిందా? అన్న దానిపై అధికారులు ఇప్పుడు దృష్టిసారించినట్టు పేర్కొంది.
అమెరికాలో చైనా రాయబారిగా పనిచేసినంత కాలం క్విన్ తన అఫైర్ కొనసాగించినట్టు చైనా సీనియర్ అధికారులు కమ్యూనిస్ట్ పార్టీ అంతర్గత విచారణలో తెలిపినట్టు సమాచారం. అంతేకాదు, క్విన్ వివాహేతర సంబంధం వల్ల అమెరికాలో ఓ బిడ్డకు కూడా జన్మనిచ్చినట్టు రెండు వర్గాలను ఉటంకిస్తూ న్యూస్‌పేపర్ వెల్లడించింది. ‘వాల్‌స్ట్రీట్ జర్నల్’లో వచ్చిన కథనంపై స్పందించాల్సిందిగా నిన్నటి మీడియా సమావేశంలో చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి మావో నింగ్‌ను కోరగా, మీరు చెబుతున్న విషయం గురించి తనకు తెలియదని తప్పించుకునే ప్రయత్నం చేశారు.
అమెరికాలో చైనా రాయబారిగా విధుల్లో చేరిన ఆరు నెలల తర్వాత క్విన్ గాంగ్ నెల రోజులపాటు అదృశ్యమయ్యారు. దీంతో ప్రభుత్వం ఆయనను తొలగించి సీనియర్ దౌత్యవేత్త వాంగ్ యిని జులైలో రక్ష మంత్రిగా నియమించింది. జులై 2021 నుంచి ఈ ఏడాది జనవరి వరకు అమెరికాలో చైనా అగ్ర రాయబారిగా ఉన్నారు.