Preamble: రాజ్యాంగ పీఠికలో ఆ రెండు పదాలు తొలగించారు: కాంగ్రెస్
- సెక్యులర్, సోషలిస్ట్ పదాలను తీసేశారంటూ అధిర్ రంజన్ ఆరోపణ
- బీజేపీ సర్కారు చాలా తెలివిగా వ్యవహరించిందంటూ వ్యంగ్యం
- పార్లమెంట్ లో ఈ విషయాన్ని ప్రస్తావించాలని చూసినా కుదరలేదని వివరణ
కేంద్ర ప్రభుత్వంలోని బీజేపీ చాలా తెలివిగా వ్యవహరిస్తోందని, గుట్టుచప్పుడు కాకుండా రాజ్యాంగ పీఠికలో మార్పులు చేసిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ఈమేరకు రాజ్యాంగ పీఠికలో సెక్యులర్, సోషలిస్టు పదాలను తొలగించిందంటూ కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత అధిర్ రంజన్ చౌధరి మండిపడ్డారు. పార్లమెంట్ కొత్త భవనంలోకి మారుతున్న సందర్భంగా సభ్యులు అందరికీ కేంద్రం కానుకలు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ కానుకల బ్యాగ్ లో రాజ్యాంగం ప్రతితో పాటు పార్లమెంట్ పాత కొత్త భవనాల స్టాంపులు, ఓ స్మారక నాణెం ఉన్నాయి.
కేంద్రం ఇచ్చిన గిఫ్ట్ బ్యాగులోని రాజ్యాంగం ప్రతిని చేతులతో పైకెత్తి పట్టుకుని అధిర్ రంజన్ చౌధరి కొత్త బిల్డింగ్ లోకి అడుగుపెట్టారు. అనంతరం ఆ పుస్తకాన్ని తెరచి చూడగా.. పీఠికలో సెక్యులర్, సోషలిస్టు పదాలు తొలగించినట్లు గుర్తించానని అధిర్ రంజన్ తెలిపారు. ఈ విషయాన్ని పార్లమెంట్ లో ప్రస్తావించేందుకు ప్రయత్నించినట్లు పేర్కొన్నారు. అయితే, కొత్త భవనంలో తొలిరోజు తనకు మాట్లాడే అవకాశం లభించలేదని అన్నారు. ఈ ప్రత్యేక సమావేశాల్లో అవకాశం లభించిన వెంటనే ఈ విషయాన్ని మిగతా సభ్యుల ముందు ప్రస్తావిస్తానని వివరించారు.