YS Jagan: దసరా నుంచే విశాఖ నుంచి పరిపాలన: వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు
- కార్యాలయాల నిర్ధారణకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తామన్న ముఖ్యమంత్రి
- అసెంబ్లీ సమావేశాలను సీరియస్‌గా తీసుకోవాలని సూచన
- చంద్రబాబు కుంభకోణాలపై అసెంబ్లీ వేదికగా చర్చిద్దామన్న జగన్
వచ్చే దసరా పండుగ నుంచే విశాఖ నుంచి పరిపాలన ప్రారంభిస్తామని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖలో కార్యాలయాల నిర్ధారణకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తామని చెప్పారు. కమిటీ సూచనల మేరకు కార్యాలయాల ఏర్పాటు ఉంటుందన్నారు. దసరా పర్వదినం నాటికి కార్యాలయాల తరలింపు పూర్తి కావాలన్నారు.
ముఖ్యమంత్రి అధ్యక్షతన తాడేపల్లిలో ఈ రోజు కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ... రేపటి నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాలను సీరియస్‌గా తీసుకోవాలని సూచించారు. సంబంధిత మంత్రులు అన్ని అంశాలతో సభకు రావాలన్నారు.
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని మంత్రులకు సూచించారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై కేంద్రం ఏం నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు కుంభకోణాలపై అసెంబ్లీ వేదికగా చర్చిద్దామన్నారు. కాగా, రేపటి నుంచి ఐదు రోజుల పాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి.