Justin Trudeau: భారత్‌తో వివాదం.. కెనడాకు నిప్పుతో చెలగాటమే!: అంతర్జాతీయ నిపుణులు
- భారత్‌పై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపణలతో అంతర్జాతీయంగా ఆందోళన
- ట్రూడోపై అమెరికా నిపుణుల విమర్శలు
- భారత్‌తో వివాదం నిప్పుతో చెలగాటమని వ్యాఖ్య
- ఈ వివాదంలో అమెరికా జోక్యం చేసుకోకూడదని సూచన
కెనడాలో ఖలిస్థానీ మద్దతుదారుడు హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత ఏజెంట్ల హస్తం ఉండొచ్చంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో చేసిన వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య పెను దూమారం రేపాయి. ఈ ఆరోపణలపై అంతర్జాతీయంగా కూడా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ వివాదంపై అమెరికా మేధోమధన సంస్థ హడ్సన్ ఇన్స్టిట్యూట్ వేదికగా అంత్జాతీయ వ్యవహారాల నిపుణుల చర్చ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో పాల్గొన్న నిపుణులు కెనడా తీరును దుయ్యబట్టారు.
ఖలిస్థానీ ఉద్యమాన్ని లాభార్జనగా చూస్తున్న కొంత మంది చేతుల్లో ట్రూడో కీలుబొమ్మగా మారారని ఈ కార్యక్రమంలో నిపుణులు మండిపడ్డారు. ఖలిస్థానీ నేత హత్యను భారత నిఘావర్గాలకు అంటగడుతూ చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటని అన్నారు. ఇది ట్రూడోకు దీర్ఘకాలిక రాజకీయ ప్రయోజనాలు చేకూర్చినా నాయకత్వ లక్షణం మాత్రం కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వివాదంలో అమెరికా జోక్యం చేసుకోరాదని తాము భావిస్తున్నామని తెలిపారు. కెనడా నిప్పుతో చెలగాటమాడుతోందని వ్యాఖ్యానించారు.
ఇక తాజా వివాదంతో అమెరికా పెద్ద ఇరకాటంలో పడింది. సన్నిహిత మిత్రదేశమైన కెనడా ఓవైపు, వ్యూహాత్మక భాగస్వామి భారత్ మరోవైపు ఉండటం అమెరికాకు తలనొప్పిగా మారింది.