Punjab: పోస్ట్‌మార్టంకు తరలిస్తుండగా పోలీస్ అధికారి శరీరంలో కదలికలు
- పంజాబ్‌లోని లూథియానాలో వెలుగు చూసిన ఘటన
- విషపు పురుగు కుట్టడంతో పోలీసు అధికారిని ఆసుపత్రిలో చేర్చిన కుటుంబసభ్యులు
- అనారోగ్యంతో తమ కుమారుడు మరణించారని ఆసుపత్రి వైద్యులు చెప్పినట్టు తండ్రి వెల్లడి
- మరుసటి రోజు పోస్ట్‌మార్టంకు తరలిస్తుండగా పోలీసు అధికారి శరీరంలో కదలికలు
- మరో ఆసుపత్రికి ఆయన తరలింపు, ప్రస్తుతం నిలకడగా ఆరోగ్యం
విషపు పురుగు కుట్టడంతో చనిపోయాడనుకుని ఓ పోలీస్ ఆఫీసర్‌ను పోస్ట్ మార్టంకు తరలిస్తుండగా ఆయనలో కదలికలు రావడం సంచలనంగా మారింది. పంజాబ్‌లోని లూథియానాలో ఇటీవల ఈ ఘటన వెలుగు చూసింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. పోలీస్ అధికారి మన్‌ప్రీత్‌ను ఓ విషపు పురుగు కుట్టింది. అనారోగ్యం పాలైన ఆయనను లూథియానాలోని బస్సీ ఆసుపత్రిలో చేర్పించారు. శరీరమంతా ఇన్‌ఫెక్షన్ వ్యాపించిన ఆయనను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స చేశారు. ఈ క్రమంలో సెప్టెంబర్ 18న అర్ధరాత్రి ఆయన మృతి చెందినట్టు ఆసుపత్రి సిబ్బంది తెలిపారని తండ్రి రామ్‌జీ చెబుతున్నారు.
మరుసటి రోజు మన్‌ప్రీత్‌ను పోస్ట్‌మార్టం కోసం తరలిస్తుండగా ఆయన శరీరంలో కదలికలు రావడాన్ని అక్కడే ఉన్న మరో పోలీసు అధికారి గుర్తించారు. వెంటనే ఆయనను మరో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం మన్‌ప్రీత్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, తమ ఆసుపత్రిలోని సిబ్బంది ఎవరూ మన్‌ప్రీత్ మరణించినట్టు చెప్పలేదని బస్సీ ఆసుపత్రి వైద్యులు చెబుతున్నారు.