Udayanidhi Stalin: సనాతన ధర్మం అంటే ఇదే.. మరోమారు ఉదయనిధి వివాదాస్పద వ్యాఖ్యలు
- పార్లమెంటు ప్రారంభోత్సవంలో రాష్ట్రపతి ముర్ముకు ఆహ్వానం లేకపోవడంపై తమిళమంత్రి సంచలన వ్యాఖ్య
- ప్రెసిడెంట్ గిరిజన మహిళ కావడం, భర్త చనిపోవడమే ఇందుకు కారణమని ఆరోపణ
- సనాతన ధర్మం నిర్మూలనకే డీఎంకే పుట్టిందని వెల్లడి
- లక్ష్యాన్ని చేరుకునే వరకూ విశ్రమించబోమని స్పష్టీకరణ
తమిళనాడు మంత్రి, డీఎంకే యువ నేత ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కొత్త పార్లమెంటు ప్రారంభోత్సవంలో రాష్ట్రపతి ముర్ముకు ఆహ్వానం దక్కలేదని ఆయన ఆరోపించారు. రాష్ట్రపతి ముర్ము గిరిజన మహిళ కావడం, ఆమె భర్త చనిపోవడమే దీనికి కారణమన్న ఆయన, సనాతన ధర్మం అంటే ఇదేనని మండిపడ్డారు.
రూ.800 కోట్ల ఖర్చుతో కట్టిన నూతన పార్లమెంటు ప్రారంభోత్సవానికి తొలి పౌరురాలైన రాష్ట్రపతికి ఆహ్వానం దక్కలేదని ఉదయనిధి వ్యాఖ్యానించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్సభలో ప్రవేశపెట్టిన సమయంలో హిందీ నటీమణులనూ ఆహ్వానించారని చెప్పారు. కానీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాత్రం వ్యక్తిగత కారణాల పేరిట దూరంగా ఉండిపోవాల్సి వచ్చిందని చెప్పారు. సనాతన ధర్మం ప్రభావానికి ఇలాంటి ఘటనలు సూచికలని చెప్పుకొచ్చారు.
గతంలో తన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయాన్ని కూడా ఆయన పేర్కొన్నారు. ‘‘జనాలు నా తలపై ఓ రేటు కట్టారు. కానీ నేను అలాంటి వాటిని పట్టించుకోను. సనాతన ధర్మాన్ని నిర్మూలించేందుకే డీఎంకే పుట్టింది. మా లక్ష్యాన్ని చేరుకునే వరకూ మేము విశ్రమించం’’ అని ఆయన అన్నారు.