Khalistani terrorist: కెనడాలో మరో ఖలిస్థాన్ ఉగ్రవాది హత్య
- విన్నిపెగ్ పట్టణంలో చోటు చేసుకున్న ఘటన
- రెండు గ్యాంగుల మధ్య గొడవలో హతం
- అతడిపై భారత్ లో ఏడు క్రిమినల్ కేసులు
ఖలిస్థాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యతో కెనడా, భారత్ మధ్య సంబంధాలు ఇప్పటికే దెబ్బతినగా.. ఇదే సమయంలో కెనడాలో మరో ఖలిస్థాన్ అనుకూల ఉగ్రవాది హత్యకు గురికావడం సంచలనం సృష్టించింది. ఖలిస్థాన్ ఉగ్రవాది అర్షదీప్ సింగ్ అలియాస్ అర్ష దాలా అనుచరుడైన సుఖ్దూల్ సింగ్ కెనడాలోని విన్నిపెగ్ పట్టణంలో హత్యకు గురయ్యాడు. రెండు గ్యాంగుల మధ్య గొడవలో భాగంగా ఇది చోటు చేసుకుంది.
ఏ-కేటగిరీ గ్యాంగ్ స్టర్ అయిన సుఖ్దూల్ సింగ్ గతంలో పంజాబ్ నుంచి కెనడాకు పరారైన వ్యక్తి. అతడిపై ఏడు క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఫోర్జరీ డాక్యుమెంట్ల ఆధారంగా 2017లో పాస్ పోర్ట్ సంపాదించి కెనడాకు పారిపోయాడు. ఇందుకు ఇద్దరు పోలీసులు సహకరించారు. అనంతరం ఆ ఇద్దరు పోలీసుల అరెస్ట్ కు గురయ్యారు. ఈ ఏడాది జూన్ లో ఖలిస్థాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యకు గురికాగా, దీని వెనుక భారత్ ప్రమేయం ఉందంటూ కెనడా ప్రధాని ట్రూడూ ఆరోపించడం తెలిసిందే. ఇది రెండు దేశాల మద్య దౌత్య యుద్ధానికి దారితీసింది. ఇదే సమయంలో మరో ఖలిస్థాన్ అనుకూల ఉగ్రవాది హత్యకు గురికావడం గమనార్హం.