Justin Trudeau: జీ20 సందర్భంగా ప్రెసిడెన్షియల్ సూట్ నిరాకరించిన కెనడా ప్రధాని ట్రూడూ.. భారత్‌పై ముందు నుంచి వ్యతిరేకతేనా?
- ఢిల్లీలో రెండ్రోజుల పాటు జరిగిన జీటీ20 సదస్సు
- అన్ని దేశాల ప్రతినిధులకు భారీ భద్రతతో హోటళ్లలో ప్రత్యేక సదుపాయాలు
- ప్రెసిడెన్షియల్ సూట్ వద్దని సాధారణ గదిలో ఉన్న ట్రూడూ
ఖలిస్థాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత్ ప్రమేయం ఉందంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడూ రేపిన చిచ్చు భారత్–కెనడా మధ్య దౌత్య సంబంధాలను దెబ్బతీశాయి. భారత్ విషయంలో ట్రూడూ ముందు నుంచే వ్యతిరేక భావజాలంతో ఉన్నట్టు తెలుస్తోంది. ఇందుకు న్యూఢిల్లీ వేదికగా జరిగిన జీ20 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా జరిగిన ఓ ఘటన బలం చేకూరుస్తోంది. భారత్ నాయకత్వం వహించిన ఈ సదస్సుకు హాజరైన పలు దేశాధినేతలకు కేంద్ర ప్రభుత్వం గొప్ప ఆతిథ్యం ఇచ్చింది.
ఈ క్రమంలో కెనడా ప్రధాని ట్రూడూకు కూడా ఢిల్లీలోని లలిత్ హోటల్‌లో ప్రత్యేకంగా రూపొందించిన ప్రెసిడెన్షియల్ సూట్‌లో బస ఏర్పాటు చేసింది. కానీ, ఇందులో ఉండటానికి ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడూ నిరాకరించారు. దాంతో, ఆయన భద్రత విషయంలో భారత ఇంటెలిజెన్స్ అధికారులలో ఆందోళనలు నెలకొన్నాయని కేంద్ర వర్గాలు తెలిపాయి. తన కోసం బుక్ చేసిన ప్రత్యేక ప్రెసిడెన్షియల్ సూట్ ను ట్రూడూ ఒక్క రోజు కూడా ఉపయోగించలేదు. బదులుగా మన దేశంలో ఉన్నంతసేపు ఆయన హోటల్‌లోని సాధారణ గదిలో బస చేశారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.