TSRTC: దసరా ముంగిట ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త
- అక్టోబరు 23న దసరా
- హైదరాబాద్ నుంచి ఇతర ప్రాంతాలకు పెద్ద ఎత్తున ప్రయాణాలు
- రానుపోను టికెట్లు బుక్ చేసుకుంటే తిరుగు ప్రయాణంపై 10 శాతం రాయితీ
- రిజర్వేషన్ సౌకర్యమున్న అన్ని సర్వీసుల్లో రాయితీ వర్తింపు
ఈ ఏడాది అక్టోబరు 23న దసరా పండుగ జరుపుకోనున్నారు. విజయదశమిని పురస్కరించుకుని తెలంగాణ రాజధాని హైదరాబాద్ నుంచి ఇతర ప్రాంతాలకు పెద్ద ఎత్తున ప్రయాణిస్తుంటారు. ఈ నేపథ్యంలో, ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ (టీఎస్ఆర్టీసీ) శుభవార్త చెప్పింది. ముందస్తు టికెట్ బుకింగ్ చేసుకునే వారికి ఏకంగా 10 శాతం రాయితీ ఇవ్వనున్నట్టు ప్రకటించింది.
అక్టోబరు 15 నుంచి 29వ తేదీల మధ్య రానుపోను ప్రయాణానికి టికెట్లు బుక్ చేసుకుంటే, తిరుగు ప్రయాణంపై 10 రాయితీ వర్తింపజేస్తామని తన ఆఫర్ లో పేర్కొంది. పైన పేర్కొన్న తేదీల్లో ప్రయాణాలకు ఈ నెల 30 లోపు టికెట్లు బుక్ చేసుకున్నవారికే రాయితీ వర్తిస్తుందని టీఎస్ఆర్టీసీ స్పష్టం చేసింది.
రిజర్వేషన్ సదుపాయం కలిగిన అన్ని రకాల బస్సుల్లో ఈ రాయితీ అమలు చేస్తామని వివరించింది. దూరప్రాంతాలకు వెళ్లేవారికి ఈ రాయితీ ఉపయుక్తంగా ఉంటుందని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ పేర్కొన్నారు.