YV Subba Reddy: చంద్రబాబు అరెస్ట్ తర్వాత దిక్కులేక టీడీపీ వేరే పార్టీ అధ్యక్షుడిపై ఆధారపడింది: వైవీ సుబ్బారెడ్డి

YV Subbareddy says tdp in trouble after chandrababu arrest

  • చంద్రబాబు అరెస్టై జైల్లో ఉన్న ప్రజల నుంచి సానుభూతి లేదన్న వైవీ సుబ్బారెడ్డి
  • ఏపీని రాజధాని లేని రాష్ట్రంగా మార్చిన ఘనత చంద్రబాబుదేనని ఆగ్రహం
  • స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో రూ.300 కోట్ల అవినీతికి పాల్పడ్డారని ఆరోపణ
  • దసరా నుంచి విశాఖ నుంచి పరిపాలన చేస్తారని స్పష్టీకరణ

టీడీపీకి దిక్కులేకే మరో పార్టీ అధినేతపై ఆధారపడిందని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ను ఉద్దేశించి వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి అన్నారు. గురువారం ఆయన విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడుతూ... చంద్రబాబు అరెస్టై జైల్లో ఉన్నప్పటికీ ప్రజల నుంచి సానుభూతి కనిపించడం లేదన్నారు. అందుకే బయటి రాష్ట్రాల్లో మద్దతు ఉన్నట్లుగా చూపించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు అరెస్ట్ తర్వాత టీడీపీ ఇబ్బందుల్లో పడిందన్నారు. అందుకే ఆ పార్టీని నడిపేందుకు వేరే పార్టీ అధ్యక్షుడిపై ఆధారపడిందన్నారు.

ఏపీని రాజధాని లేని రాష్ట్రంగా మార్చిన ఘనత చంద్రబాబుదేనని విమర్శించారు. పదేళ్లు ఉమ్మడి రాజధాని ఉన్నప్పటికీ రాజధాని లేకుండా చేశారన్నారు. తానేదో గ్లోబల్ లీడర్‌గా భావించి, సింపతీ కోసం ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో రూ.300 కోట్లు కొట్టేసి అడ్డంగా దొరికిపోయారన్నారు. కోర్టులపై తమకు నమ్మకం ఉందన్నారు.

ఏపీలో ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తాము సిద్ధంగా ఉన్నామన్నారు. విజయదశమి నుంచి విశాఖ నుంచి పరిపాలన ప్రారంభమవుతుందన్నారు. విశాఖను కేంద్రం కూడా గ్రోత్ హబ్ సెంటర్‌గా గుర్తించిందన్నారు. విశాఖలో కార్యాలయాలను సిద్ధం చేస్తున్నామని, ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. విశాఖ నుంచే ఉత్తరాంధ్ర ప్రజలకు భరోసా కల్పిస్తామన్నారు.

  • Loading...

More Telugu News