natti kumar: బాలకృష్ణ, బ్రాహ్మణిలను టార్గెట్ చేయడంపై నట్టి కుమార్ ఆగ్రహం
- బాలకృష్ణపై అంబటి వ్యవహరించిన తీరు ఆక్షేపణీయమన్న నట్టి కుమార్
- దేవాలయం వంటి అసెంబ్లీలో గొడవలు బాధాకరమని వ్యాఖ్య
- టీడీపీ ఎమ్మెల్యేల పట్ల వైసీపీ సభ్యుల తీరును తప్పుబట్టిన నట్టి కుమార్
- నారా బ్రాహ్మణిని రోజా టార్గెట్ చేయడం సరికాదని వ్యాఖ్య
- ఉదయం చంద్రబాబు, సాయంత్రం పవన్ కల్యాణ్‌ను తిట్టడానికే పరిమితమవుతున్నారని విమర్శ
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వేదికగా టీడీపీ ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణపై మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యల పట్ల ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ స్పందించారు. గురువారం ఆయన ఓ ప్రకటనను విడుదల చేశారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలపట్ల అధికార వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు వ్యవహరించిన తీరు సరికాదన్నారు. ముఖ్యంగా బాలకృష్ణపై అంబటి వ్యవహరించిన తీరు ఆక్షేపణీయమన్నారు. అసెంబ్లీ దేవాలయం వంటిదని, అలాంటిచోట గొడవలు బాధాకరమన్నారు. ఈ దేవాలయంలో ఎన్నో బిల్లులపై చర్చలు జరుగుతాయని, వాటిని ఆమోదిస్తారన్నారు.
చంద్రబాబు అరెస్ట్‌ను అసెంబ్లీ వేదికగా ప్రశ్నించే హక్కు, నిరసన వ్యక్తం చేసే హక్కు, తమ అభిప్రాయం వ్యక్తం చేసే స్వేచ్ఛ టీడీపీకి ఉన్నాయన్నారు. ఈ అంశంపై చర్చ జరగకుండా వైసీపీ వాళ్లు చీప్ ట్రిక్స్‌తో అడ్డుకుంటున్నారన్నారు. అసెంబ్లీలో వైసీపీ ప్రజాప్రతినిధుల తీరును రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని, వారి పట్ల చులకన భావం ఏర్పడుతుందని గ్రహించాలన్నారు. సభలో ఏదైనా నిర్ణయం సభాపతి తీసుకుంటారని, ఇందులో అంబటి రాంబాబు జోక్యం సరికాదన్నారు. సభలో మిగతా ఎమ్మెల్యేలలా ఆయనా ఓ సభ్యుడన్నారు.
కోట్లాది రూపాయల ప్రజాధనంతో జరుగుతోన్న సమావేశాల్లో అవసరమైన చర్చ జరగకుండా, కేవలం ఉదయం చంద్రబాబును, సాయంత్రం జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను తిట్టడానికే పరిమితమవుతున్నారన్నారు. తాను కాపు బిడ్డనంటూ అంబటి కులాల ప్రస్తావన తీసుకు రావడం సరికాదన్నారు. అంబటి పోలవరం ప్రాజెక్టు, ఇతర ప్రాజెక్టుల గురించి మాట్లాడాలన్నారు. పర్యాటక శాఖ మంత్రి రోజా కూడా నారా భువనేశ్వరి, బ్రాహ్మణిలను లక్ష్యంగా చేసుకుని మాట్లాడటం ఏమిటని ప్రశ్నించారు. తన మావయ్య చంద్రబాబు బయటకు రావాలని బ్రాహ్మణి ఆరాటపడుతున్నారని, తోటి మహిళగా సంఘీభావం తెలపకపోయినప్పటికీ కనీసం టార్గెట్ చేయడం సరికాదన్నారు. రోజా తన పర్యాటక శాఖలో చేసిన అభివృద్ధి గురించి చెప్పాలన్నారు.