Ambati Rambabu: సైకో పాలన పోవాలంటూ టీడీపీ సభ్యుల నినాదాలు.. అంబటి రాంబాబు ఆగ్రహం
- సభ ప్రారంభమైన వెంటనే టీడీపీ సభ్యుల ఆందోళన
- ఇది టీడీపీ కార్యాలయం కాదంటూ అంబటి ఆగ్రహం
- రచ్చ చేయాలని చూస్తున్నారని మండిపాటు
రెండో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు తీవ్ర గందరగోళం మధ్య ప్రారంభమయ్యాయి. చంద్రబాబు అక్రమ అరెస్ట్ పై ఇచ్చిన వాయిదా తీర్మానంపై చర్చించాలంటూ టీడీపీ సభ్యులు ఆందోళన చేపట్టారు. స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. స్పీకర్ పోడియం వద్ద ప్లకార్డులను ప్రదర్శించారు. చంద్రబాబును వెంటనే విడుదల చేయాలని, సైకో పాలన పోవాలని వారు నినాదాలు చేశారు.
ఈ నేపథ్యంలో టీడీపీ సభ్యులపై మంత్రి అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది టీడీపీ కార్యాలయం కాదని అంబటి మండిపడ్డారు. చంద్రబాబు అరెస్ట్, ఆయన అవినీతిపై చర్చకు తాము సిద్ధమని... అయితే, సభలో రచ్చ చేయాలని టీడీపీ సభ్యులు చూస్తున్నారని దుయ్యబట్టారు. చట్టసభలో జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉందని చెప్పారు. ముఖ్యమంత్రిని ఉద్దేశించి అసహ్యంగా మాట్లాడితే ఊరుకునేది లేదని, నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు.