Police Encounter: రైలులో యూపీ మహిళా పోలీసుపై దాడి చేసిన దుండగుడు ఎన్‌కౌంటర్‌లో హతం

Man wanted for attacking woman cop on train killed in police encounter in Ayodhya

  • సరయు ఎక్స్‌ప్రెస్‌లో సీటు విషయంలో మహిళా కానిస్టేబుల్, నిందితులకు మధ్య గొడవ
  • దాడిచేసి తీవ్రంగా గాయపర్చిన నిందితులు
  • ఆగస్టు 30న ఘటన
  • ఈ ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో నిందితుడు అనీశ్ హతం.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు

మహిళా పోలీసుపై రైలులో దాడిచేసిన ఇద్దరు నిందితుల్లో ఒకడు పోలీస్ ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. మరో ఇద్దరికి బుల్లెట్ గాయాలయ్యాయి. ప్రస్తుతం వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో ఈ ఉదయం జరిగిందీ ఘటన. లక్నో స్పెషల్ టాస్క్‌ఫోర్స్‌ ఎన్‌కౌంటర్‌లో నిందితుడు అనీశ్ హతమయ్యాడు. తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరిని అజాద్ ఖాన్, విశ్వంభర్ దయాళ్‌గా గుర్తించారు. ఆగస్టు 30న మహిళా కానిస్టేబుల్‌పై జరిగిన దాడిలో వీరిద్దరికి కూడా సంబంధం ఉందని పోలీసులు తెలిపారు. అలాగే, కలండర్ పోలీస్ స్టేషన్‌కు చెందిన పోలీసు రతన్‌శర్మకు ఎన్‌కౌంటర్‌లో గాయాలయ్యాయి. 

ఆగస్టు 30న అయోధ్య రైల్వే స్టేషన్‌లో సరయు ఎక్స్‌ప్రెస్ కంపార్ట్‌మెంట్‌లో రక్తపు మడుగులో పడివున్న మహిళా కానిస్టేబుల్‌ను పోలీసులు గుర్తించారు. నిందితులు పదునైన ఆయుధంతో ముఖంపై దాడిచేశారు. దాడిలో ఆమె పుర్రె ఫ్రాక్చర్ అయింది. వెంటనే ఆమెను లక్నోలోని కేజీఎంసీ ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉంది. 

సీటు విషయంలో నిందితులు, మహిళా కానిస్టేబుల్‌కు మధ్య రైలులో గొడవ జరిగినట్టు పోలీసులు తెలిపారు. గొడవ మరింత పెరగడంతో కానిస్టేబుల్‌పై నిందితులు దాడిచేసి తీవ్రంగా గాయపర్చారు. రైలు అయోధ్యకు చేరుకున్న తర్వాత నిందితులు పరారయ్యారు. కేసు నమోదు చేసుకుని వారి కోసం గాలిస్తున్న పోలీసులకు ఈ ఉదయం తారసపడిన నిందితులు కాల్పులు ప్రారంభించారు. పోలీసుల ఎదురుకాల్పుల్లో అనీశ్ హతమయ్యాడు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

  • Loading...

More Telugu News