Andhra Pradesh: ఏపీ శాసన మండలిలోనూ అదే రచ్చ
- పోడియం చుట్టుముట్టి టీడీపీ సభ్యుల ఆందోళన
- ప్లకార్డులు ప్రదర్శిస్తూ మండలిలో నిరసన
- చంద్రబాబుపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అరెస్టుపై సభ్యులు ఆందోళన చేస్తుండడంతో శాసన మండలిలోనూ గందరగోళం నెలకొంది. చంద్రబాబుపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలంటూ సభ్యులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. చైర్మన్ పోడియంను చుట్టుముట్టి నినాదాలు చేస్తున్నారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ చంద్రబాబు అరెస్టుపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీంతో మండలి చైర్మన్ వారిని పదే పదే హెచ్చరించారు. సభ్యులు తమతమ సీట్లలో కూర్చోవాలని, పోడియం దగ్గర నుంచి వెంటనే వెళ్లిపోవాలని చెప్పారు. అయినప్పటికీ టీడీపీ సభ్యులు వినిపించుకోలేదు.
మండలిలో మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. చంద్రబాబు కేసుకు సంబంధించి కోర్టులో విచారణ జరుగుతోందని గుర్తుచేశారు. విచారణ జరుగుతున్న కేసుపై సభలో చర్చించడం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. టీడీపీ సభ్యులు అడిగే ప్రతీ ప్రశ్నకు తాము జవాబివ్వడానికి సిద్దంగా ఉన్నట్లు తెలిపారు. నినాదాలు ఆపేసి సభ సజావుగా జరిగేలా చూస్తే ప్రభుత్వం తరఫున అన్నింటికీ జవాబిస్తామని వివరించారు. మండలిలో సభ్యులు నినాదాలు చేయడం, ఆందోళన చేయడం వల్ల చంద్రబాబు చేసిన తప్పు మాఫీ అవుతుందా అంటూ బొత్స ప్రశ్నించారు.