Chandrababu: చంద్రబాబు కస్టడీ పిటిషన్ పై తీర్పు మధ్యాహ్నం 2.30 గంటలకు వాయిదా.. కారణం ఇదే!
- కస్టడీ పిటిషన్ పై తీర్పును వాయిదా వేసిన ఏసీబీ కోర్టు
- మధ్యాహ్నం 1.30 గంటలకు చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై తీర్పును వెలువరించనున్న హైకోర్టు
- ఆ తీర్పు వచ్చేంత వరకు తీర్పును వాయిదా వేయాలన్న చంద్రబాబు లాయర్లు
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును సీఐడీ కస్టడీకి ఇచ్చే పిటిషన్ పై తీర్పును మధ్యాహ్నం 2.30 గంటలకు ఏసీబీ కోర్టు వాయిదా వేసింది. ఈ పిటిషన్ పై విచారణ సందర్భంగా చంద్రబాబు తరపు లాయర్లు తమ వాదనలు వినిపిస్తూ... చంద్రబాబు వేసిన క్వాష్ పిటిషన్ పై ఏపీ హైకోర్టు మధ్యాహ్నం 1.30 గంటలకు తీర్పును వెలువరించనుందని ఏసీబీ కోర్టుకు తెలిపారు. క్వాష్ పిటిషన్ పై తీర్పు వచ్చేంత వరకు వేచి చూడాలని కోరారు. ప్రభుత్వం తరపు వాదనలు వినిపిస్తున్న లాయర్లు కూడా క్వాష్ పిటిషన్ పై తీర్పు వెలువడనుందని కోర్టుకు తెలిపారు. దీంతో, ఏసీబీ కోర్టు జడ్జి తీర్పు వాయిదాపై అప్పటికప్పుడే నిర్ణయం తీసుకున్నారు. కస్టడీ పిటిషన్ పై తీర్పును మధ్యాహ్నం 2.30 గంటలకు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. ఈ నేపథ్యంలో, క్వాష్ పిటిషన్ పై హైకోర్టు తీర్పు ఏ రకంగా వెలువడబోతోందనే ఉత్కంఠ ఇరు తెలుగు రాష్ట్రాల్లో నెలకొంది.