Supreme Court: ఢిల్లీలో గ్రీన్ క్రాకర్లకు సైతం నో చెప్పిన సుప్రీంకోర్టు
- ఢిల్లీ ప్రభుత్వ నిర్ణయంలో జోక్యానికి నిరాకరణ
- ఇప్పటికైతే అన్ని రకాల క్రాకర్లపై నిషేధం కొనసాగుతుందని స్పష్టీకరణ
- తమ ముందుకు వచ్చిన పిటిషన్ల కొట్టివేత
గ్రీన్ క్రాకర్లకు సైతం సుప్రీంకోర్టు నో చెప్పింది. బేరియంతో ఫైర్ క్రాకర్ల తయారీ, వినియోగాన్ని అనుమతించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ ను సైతం తోసిపుచ్చింది. వచ్చే దీపావళికి అన్ని రకాల క్రాకర్ల వినియోగాన్ని నిషేధిస్తూ ఢిల్లీ సర్కారు తీసుకున్న నిర్ణయానికి మద్దతు పలికింది. ఈ నిర్ణయంలో జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. 2018 నాటి నిషేధాన్ని అధికారులు విధిగా అమలు చేయాలని జస్టిస్ బోపన్న, జస్టిస్ సుందరేష్ తో కూడిన ధర్మాసనం ఆదేశించింది.
కేంద్ర ప్రభుత్వం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఐశ్వర్య భాటి హాజరై వాదనలు వినిపించారు. బేరియంను 2018 దీపావళి కోసం నిషేధించినట్టు వివరించారు. ఇప్పటికైతే గ్రీన్ లేదా మరొకటి అయినా అన్ని రకాల క్రాకర్లపై ఢిల్లీలో నిషేధం విధించినట్టు కోర్టు స్పష్టం చేసింది. ఢిల్లీలో క్రాకర్లను కాల్చిన వారిపై కేసులు పెట్టడం పరిష్కారం కాదంటూ.. పర్యావరణానికి, ప్రజల ఆరోగ్యానికి హాని కలిగిస్తున్న వాటి తయారీ మూలాల్లోకి వెళ్లాల్సి ఉంటుందని పేర్కొంది. ఢిల్లీ సర్కారు ఇప్పటి వరకు క్రాకర్లు కాలుస్తున్నారంటూ 2,616 మంది వ్యక్తులపై కేసులు మోపింది.