canada: ట్రూడూకి బ్యాడ్ టైమ్: కెనడాలో ప్రతిపక్ష నేతకు పెరుగుతున్న ప్రజాదరణ
- ఉత్తమ ప్రధాని అభ్యర్థిగా కన్జర్వేటివ్ పార్టీ నేత పియర్ పొయిలీవ్రే
- 41 శాతం మంది ప్రజల అభిప్రాయం
- ఏడాది క్రితంతో పోలిస్తే ఐదు పాయింట్లు అధికం
- జస్టిన్ ట్రూడూకి గతేడాది మాదిరే 31 పాయింట్లు
కెనడా ప్రతిపక్ష నేత, కన్జర్వేటివ్ పార్టీ లీడర్ పియర్ పొయిలీవ్రేకు ప్రజాదరణ క్రమంగా బలపడుతోంది. కెనడా ఉత్తమ ప్రధాని అభ్యర్థిగా 41 శాతం ప్రజలు పొయిలీవ్రేకి మద్దతు పలుకుతున్నారు. ప్రస్తుత ప్రధాని జస్టిన్ ట్రూడూకి మద్దతు పలికే వారి సంఖ్య ఏమాత్రం మార్పు లేకుండా 31 శాతం వద్దే ఉంది. గ్లోబల్ న్యూస్ సంస్థ కోసం ఇప్సాస్ సంస్థ నిర్వహించిన సర్వేలో ఈ విషయాలు తెలిశాయి.
ఏడాది క్రితం నిర్వహించిన సర్వేతో పోలిస్తే.. ప్రధానిగా పొయిలీవ్రేకు మద్దతు ఐదు శాతం పెరిగింది. జస్టిన్ ట్రూడో, ఆయన ప్రభుత్వానికి ప్రాణ వాయువు అందిస్తున్న న్యూ డెమొక్రటిక్ పార్టీ నేత జగ్మీత్ సింగ్ ప్రజాదరణ సైతం మసకబారుతోంది. ఏడాది క్రితంతో పోలిస్తే నాలుగు పాయింట్లు తగ్గింది. గ్లోబల్ న్యూస్ పత్రిక ఈ వివరాలను ప్రచురించింది. ఖలిస్థాన్ ఉగ్రవాది నిజ్జర్ హత్య విషయమై భారత్ - కెనడా సంబంధాలు ప్రమాదంలో పడిన సమయంలో ఈ సర్వే వివరాలు విడుదల కావడం ఆసక్తిని కలిగించాయి.
భారత సంతతికి చెందిన సిక్కులు, ఖలిస్థాన్ అనుకూల ఓట్ల కోసం, న్యూ డెమొక్రటిక్ పార్టీ మద్దతు కోసం.. భారత్ వ్యతిరేక వైఖరిని అనుసరిస్తున్న ట్రూడూకి తాజా సర్వే ఫలితాలు ప్రతికూలంగా భావించొచ్చు. ప్రధాని ట్రూడూ భారత్ పాత్రపై చేసిన ఆరోపణలకు తగిన ఆధారాలతో ముందుకు రావాలని ఇప్పటికే పొయిలీవ్రే డిమాండ్ చేయడం గమనార్హం. అన్ని సాక్ష్యాలను బయట పెడితే అప్పడు కెనడా ప్రజలు దానిపై తమ తీర్పును చెప్పగలరని పేర్కొన్నారు.