Supreme Court: ఉదయనిధి స్టాలిన్ కు సుప్రీంకోర్టు నోటీసులు
- సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఉదయనిధి
- చర్యలు తీసుకోవాలంటూ దాఖలైన పిటిషన్
- తమిళనాడు సర్కారు, ఉదయనిధి స్టాలిన్, ఏ రాజాలకు నోటీసుల జారీ
సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్, డీఎంకేకు చెందిన ఎంపీ ఏ రాజా, మరో 14 మందికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. సనాతన ధర్మాన్ని తుడిచి పెట్టేయాలంటూ ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలకు గాను, ఆయనపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలంటూ ఓ పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారించిన సుప్రీంకోర్టు.. దీనిపై స్పందన తెలియజేయాలని కోరుతూ ఉదయనిధి స్టాలిన్ తో పాటు తమిళనాడు ప్రభుత్వం, ఆ రాష్ట్ర పోలీసు శాఖ, సీబీఐ, ఏ రాజా, తదితరులకు నోటీసులు జారీ చేసింది.
ఉదయనిధి స్టాలిన్ ఈ నెల 2న సనాతన ధర్మంపై పరుష వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మాన్ని డెంగీ, మలేరియాతో పోల్చారు. దీన్ని కేవలం వ్యతిరేకించడం కాకుండా, సమాజం నుంచి నిర్మూలించాలని వ్యాఖ్యానించారు. సనాతన నిర్మూలన సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఉదయనిధి ఈ విధంగా మాట్లాడారు. సామాజిక న్యాయం, సమానత్వానికి సనాతన ధర్మం వ్యతిరేకమన్నారు. ‘‘కొన్నింటిని వ్యతిరేకించకూడదు. నిర్మూలించాలంతే. మనం డెంగీ, దోమలు, మలేరియా, కరోనాను వ్యతిరేకించకూడదు. వాటిని తుడిచి పెట్టేయాలి. అదే మాదిరిగా సనాతనాన్ని కూడా నిర్మూలించాలి’’ అని ఉదయనిధి పేర్కొనడం గమనార్హం. డీఎంకే ఎంపీ ఏ రాజా అయితే మరో అడుగు ముందుకు వేసి సనాతన ధర్మాన్ని ఎయిడ్స్ వ్యాధితో పోల్చారు.