Perni Nani: జూ.ఎన్టీఆర్ సినిమా డైలాగ్‌లా.. ఏమో తెలియదు, మర్చిపోయా, గుర్తులేదు.. ఇదీ చంద్రబాబు సమాధానం: పేర్ని నాని
- స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో రూ.371 కోట్లు దోచేశారని ఆగ్రహం
- సీమెన్స్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకొని డిజైన్ టెక్‌కు డబ్బులు ఎలా పంపించారని ప్రశ్న
- షెల్ కంపెనీలతో హవాలా ద్వారా డబ్బులు దోచేశారని ఆరోపణ
- చంద్రబాబు 13 చోట్ల సంతకాలు చేశారన్న పేర్ని నాని
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు డొల్ల కంపెనీల ద్వారా రూ.371 కోట్లు దోచేశారని పేర్ని నాని మండిపడ్డారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. సీమెన్స్‌తో రాష్ట్ర ప్రభుత్వానికి ఒప్పందం జరిగితే ప్రభుత్వం ఇచ్చే డబ్బులు ఆ కంపెనీకి వెళ్లాలి కానీ, డిజైన్ టెక్ అనే కంపెనీకి ఎలా వెళ్లాయి? అని ప్రశ్నించారు. స్కిల్ కేసులో ఒప్పందం జరిగిన నెల రోజులకు రూ.371 కోట్లు కొట్టేయడానికి ముకుల్ అగర్వాల్ అనే వ్యక్తితో కంపెనీని ఏర్పాటు చేయించారని ఆరోపించారు. ఆ తర్వాత పలు డొల్ల కంపెనీలు ఏర్పాటు చేశారన్నారు.
సీమెన్స్‌తో ఒప్పందం జరిగితే డిజైన్ టెక్‌కు డబ్బులు ఎందుకు వెళ్లాయి? అని అడిగితే ఎవరూ సమాధానం చెప్పడం లేదన్నారు. ఈ షెల్ కంపెనీని ముందే ఏర్పాటు చేసి, అక్కడి నుంచి మరో డెల్ల కంపెనీకి పంపించి, అక్కడి నుంచి హవాలా ద్వారా చేతులు మార్చారన్నారు. కేబినెట్ తీర్మానం చేసిన సీమెన్స్ కంపెనీని పక్కన ఎలా పెట్టారని ప్రశ్నించారు. హవాలా ద్వారా చంద్రబాబు పీఏ శ్రీనివాస్, లోకేశ్ స్నేహితుడు కిలారి రాజేశ్‌కు డబ్బులు ముట్టాయన్నారు. కానీ చంద్రబాబు తానేదో నీతిమంతుడిని అన్నట్లు మాట్లాడుతున్నారన్నారు.
టీడీపీ ఎమ్మెల్యేలపై విమర్శలు
ఇక్కడ (అసెంబ్లీలో) కూర్చొని, ఇప్పటి వరకు ఈలలు వేసినటువంటి టీడీపీ ఎమ్మెల్యేలు ఈ కేసుపై సమాధానం చెప్పడం లేదన్నారు. రూ.3300 కోట్లతో సీమెన్స్ కంపెనీతో ప్రభుత్వానికి ఒప్పందం జరిగితే, ఇందులో రూ.3000 కోట్లు సదరు కంపెనీ పెట్టాలని, ప్రభుత్వం రూ.371 కోట్లు పెట్టాలని అంగీకారం కుదిరితే, ఆ కంపెనీ ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండానే, ప్రభుత్వం రూ.371 కోట్లు ఎలా విడుదల చేసింది? అని అడిగారు. స్కిల్ డెవలప్‌మెంట్ వ్యవహారంలో కుంభకోణం జరిగిందనేందుకు ఇది నిదర్శనమన్నారు. ఇక్కడే చంద్రబాబు దొంగతనం తేటతెల్లమైందన్నారు. ఈ కేసులో చంద్రబాబు కొంత తీసుకొని, తమకూ కొంత ఇస్తాడనే ఇక్కడ కూర్చున్నవారు సభలో రచ్చ చేస్తున్నట్లుగా ఉందని మండిపడ్డారు. 2015 డిసెంబర్ నుంచి 2016 జనవరి వరకు విడతలవారీగా రూ.371 కోట్లను డొల్ల కంపెనీలకు డబ్బులు పంపించారన్నారు. ఇంత చేస్తే కొంతమంది అసలు చంద్రబాబు ఏం చేశారు? అని అడుగుతున్నారని విమర్శించారు.
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో చంద్రబాబు 13చోట్ల సంతకాలు పెట్టారన్నారు. ఈ కేసులో సీఐడీ విచారణ జరుపుతుంటే టీడీపీ అధినేత చంద్రబాబు.. ఏమో తెలియదు, మర్చిపోయా, గుర్తులేదు అంటూ జూనియర్ ఎన్టీఆర్ సినిమాలా డైలాగ్‌లు కొడుతున్నారని ధ్వజమెత్తారు. ఎన్నిసార్లు అడిగినా ఇదే చెబుతున్నారన్నారు. రాజ్యాంగబద్ధంగా సీఎంగా ప్రమాణం చేసిన వ్యక్తి ప్రజల సొమ్మును దోచుకున్నారన్నారు.
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అక్రమాలు జరిగాయని చెబుతున్నారు కదా, హవాలా డబ్బులు చంద్రబాబు లెక్కిస్తుంటే చూశారా? చంద్రబాబు అకౌంట్లో డబ్బులు పడ్డాయా? అని మరొకరు అడుగుతున్నారని, అలా అయితే లంచాలు తీసుకోవడానికి ఫోన్ పేలు, అకౌంట్ ట్రాన్సుఫర్‌లు జరుగుతున్నాయా? అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు పీఏ శ్రీనివాస్, లోకేశ్ స్నేహితుడు రాజేశ్‌కు డబ్బులు వచ్చాయని ఐటీ డిపార్టుమెంట్ చెప్పిందన్నారు. కేంద్రప్రభుత్వ సంస్థలు నోటీసులు ఇచ్చాక ఇంకా సాక్ష్యం అడగటం ఏమిటని ప్రశ్నించారు. ఎవరైనా నిద్రపోతే లేపవచ్చు.. కానీ నిద్ర నటిస్తున్నవారిని కష్టమన్నారు. అ డబ్బులు మీరు పంచుకుంటారు కాబట్టే చంద్రబాబును వెనుకేసుకు వస్తున్నారన్నారు. తాము లంచాలు తినడం లేదని వారు ఎక్కడా చెప్పడం లేదని, బెయిల్ పిటిషన్ పై వాదనలు వినిపించే సమయంలోను గవర్నర్ సంతకం లేదని, ఈ చట్టం వర్తించదనే మాటలు చెబుతున్నారు తప్ప స్కాం జరగలేదని చెప్పడం లేదన్నారు.
రూ.371 కోట్ల ప్రజాధనాన్ని దోచుకున్నారన్నారు. తాము రెండులక్షల మందికి స్కిల్ డెవలప్‌మెంట్ ద్వారా నైపుణ్యాలు అందించామని చెబుతున్నారని, కానీ బయట రూ.2వేలు పెడితే ఆటోక్యాడ్ నేర్చుకోవచ్చునని చెప్పారు. అయినా ఇన్నాళ్లు చంద్రబాబు ఒక్కడేనని, ఇప్పుడు లోకేశ్ కూడా జత కలిశాడు కాబట్టి రెండు పాకెట్లు నింపుకోవడానికే టెండర్ లేకుండా దొంగ ఎంవోయూలు, దొంగ కంపెనీలు, షెల్ కంపెనీల ద్వారా దోచుకున్నారన్నారు.