Roja: హైకోర్టు తీర్పు వచ్చింది.. ఇప్పుడేమంటావ్ బాలకృష్ణా!: రోజా
- బాలకృష్ణకు దమ్ముంటే ఈ కేసులో ఈడీ విచారణ కోరాలని డిమాండ్
- అసెంబ్లీలో చర్చించకుండా తప్పించుకుంటున్నారని విమర్శ
- దమ్ముంటే హైకోర్టు జడ్జి వద్దకు వెళ్లి ఇలాగే తొడగొట్టి, మీసం మెలేస్తే తెలుస్తుందని వ్యాఖ్య
నందమూరి బాలకృష్ణ సహా టీడీపీ ఎమ్మెల్యేలకు మంత్రి రోజా సవాల్ విసిరారు. అసెంబ్లీ సమావేశాల అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ... స్కిల్ డెవలప్మెంట్ కేసులో స్కాం జరిగిందనే అంశంపై చర్చకు సిద్ధమా? అని ప్రశ్నించారు. బాలకృష్ణకు దమ్ముంటే ఈ కేసులో ఈడీ విచారణ కోరాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో ఈ అంశంపై చర్చిద్దామంటే టీడీపీ పారిపోయిందని విమర్శలు గుప్పించారు.
అసలు స్కిల్ డెవలప్మెంట్ కేసులో స్కాంపై ప్రభుత్వం వద్ద ఆధారాలు లేవని టీడీపీ నేతలు చెబుతున్నారని, అలాంటప్పుడు హైకోర్టు చంద్రబాబు క్వాష్ పిటిషన్ ఎందుకు కొట్టివేసిందని ప్రశ్నించారు. ఇప్పుడు టీడీపీ ఏం చెబుతుంది? అన్నారు. తనపై కేసులు కొట్టివేయాలని చంద్రబాబు వేసిన పిటిషన్లను కొట్టివేసిందని, అసెంబ్లీ చర్చించకుండా తప్పించుకున్నారని మండిపడ్డారు.
'తనపై వేసిన కేసులను కొట్టివేయాలని మీరు వేసిన పిటిషన్లను.. అది కుదరదని చెప్పి హైకోర్టు కొట్టేసింది.. ఇప్పుడేమంటావ్ బాలకృష్ణా! అని నేను అడుగుతున్నాను. అసెంబ్లీకి వచ్చి చిల్లర చేష్టలు చేయడం కాదు. నీకు దమ్ముంటే, దైర్యం ఉంటే హైకోర్టు వద్దకు వెళ్లి, జడ్జి ముందు ఇలాగే తొడగొట్టి, మీసం తిప్పి, విజిల్స్ వేయండి అప్పుడు తెలుస్తుంది' అని మండిపడ్డారు.