Imphal Violence: బెయిలుపై విడుదలైన వ్యక్తి తిరిగి అరెస్ట్.. ఇంఫాల్‌లో మళ్లీ చెలరేగిన ఘర్షణలు
- బెయిలుపై విడుదలైన ఐదుగురు విలేజ్ డిఫెన్స్ వలంటీర్లు
- పదేళ్ల క్రితం నాటి కేసులో వారిలో ఒకరు మళ్లీ అరెస్ట్
- పలు ప్రాంతాల్లో నిరసనకు దిగిన ఆందోళనకారులు
- బాష్పవాయువు గోళాలు ప్రయోగించిన భద్రతా దళాలు
మణిపూర్ రాజధాని ఇంఫాల్‌లో మళ్లీ ఘర్షణలు చెలరేగాయి. బెయిలుపై విడుదలైన ఐదుగురు విలేజ్ డిఫెన్స్ వలంటీర్లలో ఒకరిని కేంద్ర భద్రతా సంస్థ తిరిగి అరెస్ట్ చేయడంతో గత రాత్రి అల్లర్లు చెలరేగాయి. సెక్యూరిటీ దళాలు, నిరసనకారుల మధ్య ఇంఫాల్ పశ్చిమలోని కొన్ని ప్రాంతాల్లో ఘర్షణలు జరిగాయి. బెయిలుపై విడుదలైన తర్వాత మిగతా నలుగురిని అధికారులు వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. నిషేధిత పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి చెందిన మెయిరంగ్‌థెమ్ ఆనంద్‌ను తిరిగి అరెస్ట్ చేశారు.
పదేళ్ల క్రితం నాటి కేసులో తన భర్తను అరెస్ట్ చేసినట్టు పోలీసులు తమతో చెప్పారంటూ ఇంఫాల్ పోలీస్ స్టేషన్ బయట ఆనంద్ భార్య విలపిస్తూ చెప్పింది. తామందరం బెయిలుపై విడుదలైన తర్వాత ఆనంద్‌ను కొందరు అధికారులు తీసుకెళ్లారని, అతడిని చూడ్డం అదే చివరిసారని బెయిలుపై విడుదలైన మరో వలంటీర్ తెలిపాడు.
ఇంఫాల్ పశ్చిమ జిల్లాలోని క్వాకీథేల్ స్ట్రెచ్, సింగ్‌జమేయి, యురిపోక్‌లలో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు పలుమార్లు టియర్ గ్యాస్‌ను ప్రయోగించారు. ఆందోళనకారులు రోడ్లపై టైర్లు తగలబెట్టి ప్రభుత్వానికి, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.