Scrub Typhus: మహారాష్ట్రకూ పాకిన స్క్రబ్ టైఫస్.. 16 కేసుల గుర్తింపు
- అప్రమత్తమైన వైద్యశాఖ.. జిల్లాల్లో వైద్య పరీక్షలు
- ఒడిశాలో ఈ వైరస్ కు ఐదుగురి బలి
- జ్వరం, తలనొప్పి, ఒళ్లు నొప్పులు వైరస్ లక్షణాలు
ఒడిశాలో బయటపడ్డ స్క్రబ్ టైఫస్ వైరస్ మహారాష్ట్రకూ పాకింది. మూడు జిల్లాల్లో మొత్తం 16 కేసులను గుర్తించినట్లు వైద్యాధికారులు తెలిపారు. ఔరంగాబాద్, జల్నా, బుల్దానా జిల్లాల్లో ఈ వైరస్ బాధితులను గుర్తించినట్లు వివరించారు. ఒడిశాలోని బార్గఢ్ జిల్లాలో ఈ వైరస్ కారణంగా ఐదుగురు చనిపోగా.. హిమాచల్ ప్రదేశ్ లోని సిమ్లాలో మరో ఐదుగురు ఈ వైరస్ బారిన పడి మరణించారని కేంద్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లాల్లో వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు వైరస్ నియంత్రణకు చర్యలు చేపట్టారు.
స్క్రబ్ టైఫస్.. ఓరియెంటియా త్సుత్సుగముషి అనే బ్యాక్టీరియా కారణంగా ఈ వైరస్ సోకుతుందని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (సీడీసీ) వెల్లడించింది. వైరస్ బాధితుల్లో ప్రధానంగా జ్వరం, తలనొప్పి, తీవ్రమైన ఒళ్లు నొప్పులతో పాటు కొంతమందిలో దద్దుర్లు కనిపిస్తాయని తెలిపింది. ఈ బ్యాక్టిరియా సోకిన పురుగు కుట్టడం వల్ల వైరస్ ఒకరి నుంచి మరొకరికి సోకుతుందని పేర్కొంది. పురుగు కుట్టిన పది రోజుల తర్వాత వైరస్ లక్షణాలు కనిపిస్తాయని, ఇది హెపటిటిస్ కు, గ్యాస్ట్రోఇంటెస్టినల్ హెమరేజ్, హైపోవోలెమియాకు దారితీయొచ్చని వివరించింది. లక్షణాలు బయటపడిన తర్వాత వీలైనంత త్వరగా యాంటీబయాటిక్స్ ఇవ్వడం ద్వారా బాధితులు కోలుకునే అవకాశం ఎక్కువగా ఉంటుందని తెలిపింది.