Ukraine: ఉక్రెయిన్‌కు దీర్ఘశ్రేణి క్షిపణులు.. జెలెన్స్కీకి మాటిచ్చిన అమెరికా!
- ఉక్రెయిన్‌కు మొదటి నుంచీ అండగా అమెరికా
- అత్యాధునిక ఏటీఏసీఎంఎస్ను అందిస్తామని బైడెన్ హామీ ఇచ్చినట్టు ‘ఎన్బీసీ న్యూస్’ కథనం
- ఖండించిన వైట్‌హౌస్
- 325 మిలియన్ డాలర్ల సైనిక సాయానికి సై
రష్యాతో జరుగుతున్న యుద్ధంలో ఉక్రెయిన్‌కు అండగా నిలుస్తున్న అమెరికా.. ఆ దేశానికి దీర్ఘశ్రేణి క్షిపణులను అందించేందుకు ముందుకొచ్చింది. ఏటీఏసీఎంఎస్ లాంగ్ రేంజ్ మిసైల్స్ సరఫరా చేస్తామని ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీకి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హామీ ఇచ్చినట్టు ‘ఎన్బీసీ న్యూస్’ తెలిపింది.
రష్యా ఆక్రమిత భూభాగంలోని సప్లై లైన్లు, ఎయిర్ బేస్‌లు, రైల్ నెట్‌వర్క్‌లపై దాడిచేసి అంతరాయం కలిగించేందుకు తమకు ఆర్మీ ట్యాక్టికల్ మిసైల్ సిస్టం (ఏటీఏసీఎంఎస్) సరఫరా చేయాల్సిందిగా కీవ్ పదేపదే బైడెన్ ప్రభుత్వాన్ని కోరింది. బైడెన్‌తో చర్చల కోసం గురువారం జెలెన్స్కీ వాషింగ్టన్‌ను సందర్శించారు. ఈ సందర్బంగా కీవ్‌కు 325 మిలియన్ డాలర్ల సైనిక సహాయ ప్యాకేజీని ప్రకటించినప్పటికీ ఏటీఏసీఎంఎస్ విషయంలో ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ విషయంలో పెంటగాన్ నుంచి కానీ, జెలెన్స్కీ నుంచి కానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు.
అయితే, ‘రాయిటర్స్’ మాత్రం ఉక్రెయిన్‌కు ఏటీఏసీఎంఎస్ను సరఫరా చేయాలని అమెరికా యోచిస్తోందని ఇటీవల రాసుకొచ్చింది. ఏటీఏసీఎంఎస్ను శత్రువు సెకండ్ ఎచెలాన్ దళాలపై భీకర దాడి కోసం అభివృద్ధి చేశారు. యూఎస్ ఆర్మీ వెబ్సైట్ ప్రకారం వీటిని కమాండ్ కంట్రోల్ సెంటర్లు, ఎయిర్ డిఫెన్స్, లాజిస్టిక్ సైట్లను దాడిచేయడానికి ఉపయోగించవచ్చు.
ఉక్రెయిన్‌కు మద్దతుగా ఉంటామని గురువారం బహిరంగంగానే బైడెన్ ప్రకటించారు. ఎయిర్ డిఫెన్స్ సహా అత్యాధునిక ఆయుధాలను అందిస్తామన్న బైడెన్ హామీపై జెలెన్ స్కీ కృతజ్ఞతలు తెలిపారు. తమ సైనికులకు ఇప్పుడు ఏదైతే అవసరమో అవి అందించేందుకు అమెరికా ముందుకొచ్చినందుకు థ్యాంక్స్ చెప్పారు. మరోవైపు, ఏటీఏసీఎంఎస్‌లను ఉక్రెయిన్‌కు అందిస్తామని బైడెన్ హామీ ఇచ్చినట్టుగా పేర్కొంటూ ‘ఎన్బీసీ’ రాసిన కథనాన్ని అమెరికా అధ్యక్ష కార్యాలయం వైట్‌హౌస్ ఖండించింది.