Antony Blinken: నిజాన్ని నిగ్గు తేల్చేందుకు భారత్ సహకరించాలి: అమెరికా

US wants accountability India should work with Canada in probe Antony Blinken
  • దేశాంతర అణచివేతను తీవ్రంగా పరిగణిస్తున్నట్టు ఆంటోనీ బ్లింకెన్ ప్రకటన
  • కెనడా దర్యాప్తునకు భారత్ సహకరించాలని సూచన
  • తుది ఫలితం రావాలని కోరుకుంటున్నట్టు వెల్లడి
భారత్ పై కెనడా చేసిన ఆరోపణల విషయంలో అమెరికా మరోమారు స్పందించింది. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో దర్యాప్తునకు గాను కెనడాకు భారత్ సహకరించాలని అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ సూచించారు. ఈ విషయంలో భారత్ ప్రమేయం ఉందంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించడం తెలిసిందే. దీనిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నామంటూ అమెరికా మొదట తన స్పందన తెలియజేసింది. ఇప్పుడు మరోసారి ఈ అంశంలో భారత్ పై ఒత్తిడి తెచ్చే వ్యూహాన్ని ప్రదర్శించింది.

ఈ అంశంపై అమెరికా విదేశాంగ మంత్రి బ్లింకెన్ తొలిసారిగా స్పందించారు. తాము ఈ విషయమై భారత్, కెనడాతోనూ సంప్రదింపులు చేస్తున్నట్టు బ్లింకెన్ చెప్పారు. ‘‘మేము జవాబుదారీ కోరుకుంటున్నాం. దర్యాప్తు యథాప్రకారం కొనసాగి, తుది ఫలితం రావాలి. మా భారత మిత్రులు ఈ దర్యాప్తునకు సహకరిస్తారని ఆశిస్తున్నాం’’ అని తెలిపారు. ఐక్యరాజ్యసమితి సాధారణ సమావేశాల సందర్భంగా మీడియా ప్రతినిధులతో బ్లింకెన్ మాట్లాడారు.

కెనడా చేసిన ఆరోపణల సారాంశంలోకి వెళ్లకుండా.. దేశాంతర అణచివేతను అమెరికా చాలా చాలా సీరియస్ గా పరిగణిస్తున్నట్టు బ్లింకెన్ చెప్పారు. దీనిపై తాము ఎంతో అప్రమత్తంగా ఉంటామన్నారు. ‘‘ఇది చాలా ముఖ్యమైనది. అంతర్జాతీయ సమాజంలో ఏ దేశమైనా అలాంటి చర్యల్లో పాలు పంచుకోకూడదు’’ అని బ్లింకెన్ వ్యాఖ్యానించారు. బ్లింకెన్ ప్రకటనకు ముందు అమెరికా విదేశాంగ శాఖ తన అభిప్రాయాలను పంచుకుంటూ.. భారత్ తో తమ బంధం ఎంతో ముఖ్యమైనదంటూ.. అదే సమయంలో కెనడా ఆరోపణల అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్టు పేర్కొంది. కెనడాకు అత్యంత ముఖ్యమైన మిత్ర దేశాల్లో అమెరికా కూడా ఒకటి. దీంతో తన మిత్ర దేశాన్ని సంతుష్టపరిచేందుకు అమెరికా ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తోంది.
Antony Blinken
USA
nijjar killing
Canada
allegations
investigation
cooperation

More Telugu News