USA: కెనడా-భారత్ లలో ఎవరో ఒకరే అంటే.. అమెరికా ఎంపిక ఎలా ఉంటుందంటే..!

If US Has To Pick India Or Canada It Will Choose Ex Pentagon Official

  • అమెరికాకు భారత్ వ్యూహాత్మకంగా కీలకమన్న అమెరికా రక్షణ శాఖ మాజీ అధికారి
  • కెనడా ప్రధాని పెద్ద తప్పు చేసినట్టు అభిప్రాయం
  • ఆయనకు ప్రజాదరణ తగ్గిన అంశం ప్రస్తావన  
  • కొత్త ప్రధానితో అమెరికా బంధం బలపరుచుకోగలదని విశ్లేషణ

కెనడా నిప్పుతో చెలగాటం ఆడుతోందా..? కెనడా వైఖరిని చూస్తుంటే నిపుణుల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. ఖలిస్థాన్ ఉగ్రవాది నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయం ఉందంటూ పార్లమెంట్ సాక్షిగా ప్రపంచానికి చాటి చెప్పి, భారత్ ను కెనడా ప్రధాని ఇరకాటంలోకి నెట్టడం తెలిసిందే. ఈ విషయంలో భారత్ కు వ్యతిరేకంగా అమెరికా, ఇతర మిత్ర దేశాల మద్దతును కూడగట్టేందుకు కెనడా ప్రధాని ట్రూడో ప్రయత్నించారు. దీనిపై అమెరికా ఆందోళన సైతం వ్యక్తం చేసింది. దర్యాప్తులో నిజాలు వెలుగు చూసేందుకు వీలుగా భారత్ సహకారం అందించాలని సూచించింది.

ఈ నేపథ్యంలో.. ఒకవేళ కెనడా, భారత్ లో ఏదో ఒక దేశం వైపే మొగ్గు చూపాల్సిన పరిస్థితి ఏర్పడితే అప్పుడు అమెరికా ఎవరి పక్షాన ఉంటుంది..? దీనికి అమెరికా రక్షణ శాఖ మాజీ అధికారి మైఖేల్ రూబిన్ తనదైన విశ్లేషణ ఇచ్చారు. రెండింటిలో భారత్ నే అమెరికా ఎంపిక చేసుకుంటుందన్నారు. వ్యూహాత్మకంగా కెనడా కంటే భారత్ ఎంతో ముఖ్యమైన దేశం అవుతుందని చెప్పారు. పైగా నిజ్జర్ ఉగ్రవాది అని స్పష్టం చేశారు. భారత్ తో పోరుకు కెనడా మొగ్గు చూపడం.. ఏనుగుపై చీమ యుద్ధం ప్రకటించడమే అవుతుందన్నారు. 

కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు ప్రజామోదం తగ్గిన విషయాన్ని మైఖేల్ రూబిన్ ప్రస్తావించారు. ప్రధాని పదవిలో ఆయన దీర్ఘకాలం కొనసాగలేరని.. కనుక కొత్తగా వచ్చే ప్రధానితో అమెరికా తిరిగి బంధం బలోపేతం చేసుకోగలదన్నారు. ‘‘నా అభిప్రాయంలో ప్రధాని ట్రూడో పెద్ద తప్పు చేశారు. వెనుకడుగు వేయడానికి అవకాశం లేని రీతిలో భారత్ పై ఆరోపణలు చేశారు. తాను చేసిన ఆరోపణలను నిరూపించుకోలేకపోతే, ఉగ్రవాదికి ఈ ప్రభుత్వం ఎందుకు ఆశ్రయమిచ్చిందో ఆయన వివరణ ఇవ్వాల్సి వస్తుంది’’ అని మైఖేల్ రూబిన్ పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News