sleep deprivation: నిద్రలేమితో దాంపత్య బంధానికి ముప్పు
- భావోద్వేగాల ప్రభావంతో విడాకులు
- సరిపడా నిద్రలేక మానసిక చికాకులు
- భాగస్వామిలో పెరిగిపోతున్న కోపం
- సైకలాజికల్ టుడే తాజా అధ్యయనంలో వెల్లడి
నిద్రలేమితో పలు అనారోగ్యాలు పొంచి ఉంటాయని వైద్యులు చెబుతుంటారు. అయితే, శారీరక అనారోగ్యాలకు తోడు మానసిక చికాకులు కూడా వేధిస్తుంటాయని, దీని ప్రభావం దాంపత్య జీవితంపైనా పడుతుందని తాజా అధ్యయనంలో తేలింది. సైకలాజికల్ టుడే ప్రచురించిన రిపోర్టు ప్రకారం.. నిద్రలేమి వల్ల దాంపత్య బంధం బీటలువారుతోందట. ఈ కారణంగా విడాకులు తీసుకునే జంటల సంఖ్య పెరుగుతోందని తెలిపింది. రాత్రిపూట సరిగా నిద్రించకపోవడం వల్ల మానసిక చికాకులు, కోపం పెరుగుతాయని అమెరికా అధ్యయనకారులు చెబుతున్నారు. దీని ప్రభావం భాగస్వామిపై పడుతుందని, అది కాస్తా ఇరువురి బంధాన్ని బలహీనంగా మారుస్తుందని అంటున్నారు.
ఈ అధ్యయనంలో భాగంగా 700 మందిని నిశితంగా పరిశీలించినట్లు పరిశోధకులు తెలిపారు. నిద్రలేమితో బాధపడుతున్న వారిలో పురుషులే ఎక్కువని చెప్పారు. నిద్ర సరిపోకపోతే ప్రతికూల భావోద్వేగాలు ఆధిపత్యం చెలాయిస్తాయని అన్నారు. ఈ మానసిక స్థితిలో భాగస్వామితో మాట్లాడే విధానం మారుతుందని, ఇది గొడవలకు దారితీస్తుందని చెప్పారు. ఈ ముప్పును తగ్గించేందుకు కంటినిండా నిద్రించాలని సూచిస్తున్నారు. నిద్రలేమిని జయించేందుకు కెఫిన్ ఉండే పదార్థాలకు దూరంగా ఉండాలని, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలని సలహా ఇస్తున్నారు.