Paritala Sunitha: నారా భువనేశ్వరిని, బ్రాహ్మణిని కలిసిన పరిటాల సునీత.. జగన్పై నిప్పులు
- ఏ తప్పు చేయకపోయినా చంద్రబాబును అరెస్ట్ చేశారు.. ఎందుకు భయపడాలని ప్రశ్న
- తనపై మచ్చ ఉండటంతో చంద్రబాబుకూ ఓ మచ్చ రుద్దాలని జగన్ కేసు పెట్టారని ఆరోపణ
- చంద్రబాబును సీఎంగా చేసేందుకు అందరూ ఉత్సాహంగా ఉన్నారని వ్యాఖ్య
- టీడీపీ వచ్చాక మీ అక్రమాలను బయటకు తీస్తామని వైసీపీకి హెచ్చరిక
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టై రాజమండ్రి కేంద్రకారాగారంలో ఉన్నారు. దీంతో ఆయన భార్య నారా భువనేశ్వరి, కోడలు నారా బ్రాహ్మణిలు రాజమండ్రిలోనే ఉంటున్నారు. రాజమండ్రి దీక్షా శిబిరం వద్ద వీరిని మాజీ మంత్రి పరిటాల సునీత కలిసి సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... ఏ తప్పు చేయకపోయినప్పటికీ ఎందుకు భయపడాలన్నారు. ఏదో తప్పు చేశాడని చెప్పేందుకు వెతికి వెతికి కేసు పెట్టారన్నారు. ఏపీలో సైకో సీఎం ఉన్నాడని, తనపైన కేసులు, జైలు మచ్చ ఉండటంతో ఎలాంటి మచ్చలేని చంద్రబాబుపై ఏదో ఒక మచ్చ వేయాలని అక్రమ కేసులు పెట్టడం బాధాకరమన్నారు. ఏదేమైనా చంద్రబాబు మచ్చలేని నాయకుడిగా బయటకు వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
చంద్రబాబు ఎలాంటి తప్పు చేయలేదని ప్రతి ఒక్కరికీ తెలుసునన్నారు. చంద్రబాబు అరెస్ట్ బాధాకరమన్నారు. రాయలసీమలో టీడీపీ బలంగా ఉందని, వైసీపీకి అక్కడ డిపాజిట్ కూడా రాకుండా చేస్తామన్నారు. ఎప్పుడు ఎన్నికలు వస్తాయి.. ఎప్పుడెప్పుడు చంద్రబాబును సీఎంగా చేద్దామా? అనే ఉత్సాహం అందరిలోను కనిపిస్తోందన్నారు.
జగన్, వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు రాసిపెట్టుకోండని, వచ్చేది టీడీపీ ప్రభుత్వమే అన్నారు. చంద్రబాబు ఎలాంటి తప్పు చేయకున్నా జైల్లో పెట్టారని, కానీ వైసీపీ ప్రజాప్రతినిధులు మాత్రం దోచుకుంటున్నారన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక మీ కోసం జైళ్లు కూడా కూడా పట్టవన్నారు. సీఎం నుంచి ఎమ్మెల్యేల వరకు చేసిన అక్రమాలను బయటకు కక్కిస్తామన్నారు. అందరినీ జైల్లో పెడతామని, కాసుకోమని సవాల్ చేశారు.
నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారన్నారు. సీఎం చెప్పినంత మాత్రాన సీఐడీ ఇలా కేసు పెట్టడం సరికాదన్నారు. సీఎంలు మారుతుంటారు... ఈ విషయం సీఐడీ తెలుసుకోవాలన్నారు. సైకో సీఎం, ఫ్యాక్షన్ సీఎం చెప్పిన మాట విని చంద్రబాబును జైల్లో పెట్టడం దారుణమన్నారు.