Canada: కెనడాలోని ఉగ్రవాది గుర్‌పత్వంత్ సింగ్ కు షాక్.. భారత్ లోని అతని ఆస్తుల స్వాధీనం
- ఇటీవల కెనడాలోని హిందువులకు హెచ్చరికలు జారీ చేసిన గుర్‌పత్వంత్ సింగ్
- ఖాంకోట్‌లోని ఆరు ఎకరాల భూమి, చండీగఢ్‌లోని ఇల్లు స్వాధీనం
- ఎన్ఐఏ స్వాధీనం నేపథ్యంలో ఇక ప్రభుత్వ ఆస్తులుగా పరిగణన
ఖలిస్థాన్ వేర్పాటువాది గుర్‌పత్వంత్ సింగ్ పన్నుకు చెందిన పంజాబ్‌లోని ఆస్తులను ఎన్ఐఏ స్వాధీనం చేసుకుంది. భారత్-కెనడా మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో కెనడాలో ఉంటున్న ఇతను ఇటీవల అక్కడి హిందువులకు హెచ్చరికలు జారీ చేశాడు. ఈ క్రమంలో భారత ప్రభుత్వం అతనికి షాక్ ఇచ్చింది. పంజాబ్‌లోని అతని ఇల్లు, భూమిని స్వాధీనం చేసుకుంది. అమృత్‌సర్ శివారులోని గుర్‌పత్వంత్ సింగ్ పూర్వీకుల గ్రామం ఖాంకోట్‌లోని దాదాపు ఆరు ఎకరాల భూమి, చండీగఢ్‌లోని ఇల్లును జప్తు చేసింది.
ఎన్ఏఐ వీటిని స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో ఇక వీటిని ప్రభుత్వ ఆస్తులుగా పరిగణిస్తారు. 2020లో దర్యాఫ్తు సంస్థలు ఈ ఆస్తులను అటాచ్ చేశాయి. నాటి నుంచి ఈ ఆస్తులను విక్రయించే హక్కును అతను కోల్పోయాడు. ఇప్పుడు స్వాధీనం చేసుకోవడంతో ప్రభుత్వ ఆస్తులుగా మారాయి. సిక్ ఫర్ జస్టిస్ వేర్పాటువాద సంస్థ స్థాపకుల్లో గుర్‌పత్వంత్ సింగ్ పన్ను ఒకరు. అతనిని భారత ప్రభుత్వం 2020లో ఉగ్రవాదిగా ప్రకటించింది.