Nara Lokesh: చంద్రబాబుకు మద్దతు తెలిపేవారిపై హత్యాయత్నం కేసులా?: లోకేశ్ ఆగ్రహం

Lokesh take a swipe at AP govt

  • స్కిల్  కేసులో చంద్రబాబు అరెస్ట్
  • నిరసనలు తెలుపుతుంటే కేసులు పెడుతున్నారన్న లోకేశ్
  • బ్రిటీష్ పాలనను మించి ఏపీలో అక్రమ కేసులు పెడుతున్నారని ఆగ్రహం

స్కిల్ కేసులో అరెస్టయిన చంద్రబాబుకు మద్దతు తెలిపేవారిపై కేసులు నమోదు చేస్తున్నారని, దీనిని తాము ఖండిస్తున్నామని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తెలిపారు. తెలంగాణలో లేని ఆంక్షలు ఏపీలోనే ఎందుకని ప్రశ్నించారు. బ్రిటీష్ పాలనను మించిన స్థాయిలో ఏపీలో అక్రమ కేసులు పెడుతున్నారని లోకేశ్ మండిపడ్డారు. 

చంద్రబాబుకు మద్దతుగా నిరాహార దీక్షలు, ర్యాలీలు చేస్తున్నవారిని లక్ష్యంగా చేసుకుని, హత్యాయత్నం కేసులు కూడా పెడుతున్నారని ఆరోపించారు. హత్యాయత్నం కేసులు పెట్టడం అధికార దుర్వినియోగానికి పరాకాష్ఠ అని విమర్శించారు. చంద్రబాబుకు సంఘీభావంగా సైకత శిల్పం రూపొందిస్తే వారిపైనా కేసులు పెట్టడం దేశంలో మరెక్కడా లేదని అన్నారు. 

జగన్ పాలనలో సముద్ర గర్భం, అంతరిక్షం, భూగర్భంలో కూడా 144 సెక్షన్ ఉందనేలా ఉన్నారంటూ లోకేశ్ వ్యంగ్యం ప్రదర్శించారు. నిరసన తెలుపరాదని చెప్పే హక్కు మీకెక్కడిది? అని ప్రశ్నించారు. పొరుగు రాష్ట్రాల్లో ర్యాలీలపై లేని నిషేధం ఏపీలోనే ఎందుకని నిలదీశారు. ప్రజా ఉద్యమాన్ని అక్రమ కేసులతో అడ్డుకోలేరని లోకేశ్ స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News