Nikki Haley: యావత్ ప్రపంచానికి చైనా ముప్పుగా మారింది.. యుద్ధానికి సిద్ధమవుతోంది: నిక్కీ హేలీ
- అమెరికాను ఓడించేందుకు చైనా 50 ఏళ్లుగా వ్యూహాలు రచిస్తోందన్న నిక్కీ హేలీ
- చైనా సైన్యం ఇప్పటికే కొన్ని విషయాల్లో అమెరికాతో సమానంగా ఉందని వ్యాఖ్య
- చైనాను ఎదుర్కొనేందుకు బలం, ఆత్మాభిమానం అవసరమన్న నిక్కీ
చైనా విషయంలో ప్రపంచ దేశాలన్నీ జాగ్రత్తగా ఉండాలని అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో ఉన్న నిక్కీ హేలీ అన్నారు. యావత్ ప్రపంచానికి చైనా ముప్పుగా పరిణమించిందని... ఆ దేశం యుద్ధానికి సిద్ధమవుతోందని చెప్పారు. అమెరికాను ఓడించేందుకు గత 50 ఏళ్లుగా చైనా వ్యూహాలు రచిస్తోందని అన్నారు. చైనా సైన్యం ఇప్పటికే కొన్ని విషయాల్లో అమెరికాతో సమానంగా ఉందని చెప్పారు. మన దేశ వాణిజ్య రహస్యాలను చైనా తెలుసుకుంటోందని తెలిపారు. చైనాను ఎదుర్కొనేందుకు మనకు ఆత్మబలం, ఆత్మాభిమానం అవసరమని చెప్పారు. అమెరికా ఆర్థిక వ్యవస్థ విధివిధానాలపై ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
తాను అమెరికా అధ్యక్షురాలిగా ఎన్నికైతే మధ్యతరగతి ప్రజలకు నిజమైన ఆర్థిక స్వేచ్ఛను అందించడానికి కృషి చేస్తానని చెప్పారు. శ్రామిక కుటుంబాల ఆదాయపు పన్నును తగ్గిస్తానని తెలిపారు. బైడెన్ ప్రభుత్వం చేపట్టిన 500 బిలియన్ డాలర్ల గ్రీన్ ఎనర్జీ సబ్సిడీలను తొలగిస్తానని... దీంతో శత్రు దేశానికి మన దేశ ద్వారాలు మూసుకుపోతాయని చెప్పారు.