ashok babu: టీడీపీ ప్రభుత్వం వచ్చాక ఎలా వ్యవహరించాలో జగన్ దారి చూపించారు: అశోక్ బాబు

ys jagan show us a path says ashok babu

  • చంద్రబాబును అన్యాయంగా జైలుకు పంపించారన్న అశోక్ బాబు
  • వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు గెలుపును ఆపడం ఎవరి వల్ల కాదని వ్యాఖ్య 
  • తాము అధికారంలోకి వచ్చాక జగన్, మంత్రులు జైలుకెళ్లడం ఖాయమని వెల్లడి  

అవినీతి కేసులలో పదేళ్ల పాటు బయట ఉన్న వైఎస్ జగన్ ప్రజాసేవకుడైన టీడీపీ అధినేత చంద్రబాబును అన్యాయంగా జైలుకు పంపించారని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు మండిపడ్డారు. శనివారం అమరావతిలోని టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు గెలుపును ఆపడం ఎవరివల్ల కాదన్నారు. ఆయనను ప్రజాజీవితం నుంచి ఎవరూ విడదీయలేరన్నారు. మున్ముందు టీడీపీ అధికారంలోకి వచ్చాక ఎలా ముందుకెళ్లాలో జగన్ తమకు సరికొత్త దారి చూపించారన్నారు.

తాము అధికారంలోకి వచ్చాక జగన్, ఇప్పుడున్న మంత్రులు జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. చంద్రబాబుతో పెట్టుకొని జగన్ తప్పు చేశాడని వైసీపీ నేతలే చెబుతున్నారన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ అంశంలో జీవోలు ఇచ్చిన నీలం సాహ్ని, నిధులు విడుదల చేసిన ప్రేమచంద్రారెడ్డిని ఎందుకు విచారించలేదో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పాలన్నారు. డిజైన్ టెక్ సంస్థ ఎంపిక చేసుకున్న స్కిల్లర్ సంస్థ మరికొన్ని కంపెనీలతో వ్యాపారాలు నడిపితే షెల్ కంపెనీలు అని ఎలా అంటారని ప్రశ్నించారు.

అమరావతిలో వేయని ఇన్నర్ రింగురోడ్డు , ఫైబర్ గ్రిడ్ పేరుతో చంద్రబాబుపై కొత్త అభియోగాలు మోపుతున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబుపై ఒక కేసు వెనుక మరొకటి వేయడం ద్వారా వైసీపీ ప్రభుత్వం, జగన్ తన పతనాన్ని కోరి తెచ్చుకుంటున్నారని హెచ్చరించారు. మంత్రులు తమ దుర్మార్గపు ఆలోచనతో అబద్దాన్ని నిజం చేయాలని చూస్తున్నారన్నారు. అధికారంలో ఉన్నవారు వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్నారన్నారు. చంద్రబాబు విషయంలో తప్పు చేసిన అధికారులు, నేతలకు టీడీపీ ప్రభుత్వం రాగానే తగిన విధంగా బుద్ధి చెబుతామన్నారు.

  • Loading...

More Telugu News