MS Dhoni: ధోనీ పక్క సీట్లో రెండున్నర గంటల ప్రయాణం.. అదృష్టం అంటే ఇతనిదే!
- రాంచీలో మహీ ఇంటి సమీపంలో నివసిస్తున్న వ్యక్తి
- 20 ఏళ్లలో ఒక్కసారి కూడా ధోనీని కలిసే అవకాశం రాని వైనం
- ముంబై నుంచి రాంచీ వెళ్తుండగా పక్కనే వచ్చి కూర్చుని షాకిచ్చిన ధోనీ
- రెండున్నరల గంటలు తన జీవితంలో అద్భుతమన్న అభిమాని
భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది అభిమానులు ఉన్నారు. మహీ ఎక్కడ కనిపించినా అభిమానులు చుట్టేస్తారు. అతనితో ఫొటో దిగేందుకు ప్రయత్నిస్తారు. అయితే, ప్రైవేట్ లైఫ్ ను ఇష్టపడే ధోనీ అభిమానులకు చాలా అరుదుగా అందుబాటులోకి వస్తుంటాడు. అలాంటి దిగ్గజ క్రికెటర్ రెండున్నర గంటల పాటు పక్కనే కూర్చుంటే? విమానంలో కలిసి ప్రయాణం చేస్తే? ఈ రెండున్నర గంటలూ సరదాగా మాట్లాడితే ఎలా ఉంటుంది? సగటు అభిమాని ఊహకే అందని ఈ అరుదైన లక్కీ చాన్స్ ఓ వ్యక్తికి లభించింది.
ఈ మధ్యే తన సొంత పట్టణం రాంచీలో ఓ యువ క్రికెటర్‌కు బైక్‌పై లిఫ్ట్ ఇచ్చిన మహీ ఇప్పుడు తన సొంతూరు, తన ఇంటికి కిలోమీటరు దూరంలోనే ఇరవై ఏళ్ల నుంచి ఉంటున్న మరో వ్యక్తికి సర్ప్రైజ్ ఇచ్చాడు. ఇన్నేళ్లుగా ధోనీకి ఒక్కసారి కూడా నేరుగా కలిసే అవకాశం రాని ఆ వ్యక్తి ఆనందంలో తేలిపోయాడు. ముంబై నుంచి రాంచీ వరకు మహీ పక్కనే కూర్చొన్న అతను తన అనుభావాలను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ‘ఈ రెండున్నర గంటల ప్రయాణం నా జీవితంలో అత్యంత విలువైనది’ అంటూ అభిమాని భావోద్వేగానికి గురయ్యాడు. ధోనీతో దిగిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడమే కాకుండా ఈ జర్నీ విశేషాలను రాసుకొచ్చాడు.
‘రాంచీలో ధోనీ ఇల్లు మాకు దగ్గర్లోనే ఉంటుంది. తను మా రాంచీకి ఎంతో గర్వకారణం. ధోనీకి నేను వీరాభిమానిని. 20 ఏళ్లుగా ధోనీ ఇంటికి దగ్గర్లోనే ఉంటున్నా ఎప్పుడూ కలిసింది లేదు. కానీ, ఆ దేవుడు మహీని కలిసే రోజు రాసిపెట్టాడు. ఈమధ్యే నేను ముంబై నుంచి వస్తుండగా చివరి నిమిషంలో నా సీటు మార్చుకోవడంతో రెండున్నర గంటల సమయం నా జీవితంలోనే గొప్ప అనుభూతిని ఇచ్చింది. నేను సీట్లో కూర్చోగానే ‘హలో.. నన్ను నా విండో సీటు దగ్గరకు వెళ్లనివ్వండి’ అంటూ ఓ గొంతు వినిపించింది. ఎదురుగా చూసే సరికి మహీ. అంతే మహీని కలవాలన్న నా కల నిజమైంది. ఆ షాక్ నుంచి తేరుకునేందుకు కొంత సమయం పట్టింది. మహీ వినయం ఆ క్షణాన్ని మరింత అపురూపంగా మార్చింది. మాది కూడా రాంచీనే అని తనతో చెప్పాను. అంతే సాధారణంగా విమాన ప్రయాణాల్లో కునుకు తీసే అలవాటును పక్కనపెట్టిన మహీ నాతో ఆప్యాయంగా మాట్లాడటం మొదలు పెట్టారు. అలా మేము రెండు గంటల పాటు మనస్ఫూర్తిగా మాట్లాడుకున్నాం.తనకు ఇష్టమైన వంటకాలు, టూరిస్ట్ ప్లేస్‌లు, బైక్‌లతో పాటు రాంచీ అంటే తనకు ఎంత ఇష్టమో ధోనీ చెప్పారు. తన కూతురు జీవాను ప్రతిరోజు స్కూల్ దగ్గర వదిలేయడం వంటి విషయాలన్నీ నాతో పంచుకున్నారు’ అని చెప్పుకొచ్చాడు.