Australia: వర్షం కారణంగా 33 ఓవర్లకు మ్యాచ్ కుదింపు, ఆసిస్ టార్గెట్ 317 పరుగులు
- వర్షం కారణంగా తొమ్మిది ఓవర్ల తర్వాత కాసేపు నిలిచిపోయిన మ్యాచ్
- 50 ఓవర్ల నుంచి 33 ఓవర్లకు కుదింపు
- డక్ వర్త్ లూయిస్ ప్రకారం ఆసిస్ టార్గెట్ 317 పరుగులు
ఇండోర్‌లో జరుగుతోన్న రెండో వన్డేలో ఆసిస్ ఇన్నింగ్స్‌కు వర్షం అంతరాయం కలిగించడంతో డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం మ్యాచ్‌ను 33 ఓవర్లకు కుదించారు. ఆస్ట్రేలియా లక్ష్యం 317గా నిర్ణయించారు. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 399 పరుగులు చేసింది. 400 పరుగుల లక్ష్యంతో క్రీజులోకి దిగిన ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ ప్రారంభంలో వర్షం పడింది. తొమ్మిది ఓవర్ల ఆట ముగిసేసరికి ఆసిస్ రెండు వికెట్లు కోల్పోయి 56 పరుగులు చేసింది. ఆ తర్వాత వర్షం కురిసింది.
దీంతో ఆటను నిలిపేసి, మైదానంపై కవర్లు కప్పారు. కాసేపటికి వర్షం నిలిచిపోవడంతో కవర్లు తొలగించి, ఆటను ప్రారంభించారు. అయితే డక్ వర్త్ లూయీస్ పద్ధతి ప్రకారం ఆసిస్ లక్ష్యాన్ని 33 ఓవర్లలో 317 పరుగులుగా ఖరారు చేశారు. అప్పటికే 9 ఓవర్లు ముగిసి 56 పరుగులు వచ్చిన నేపథ్యంలో మరో 24 ఓవర్లలో 261 పరుగులు చేయాలి.