Anantapur District: జేసీ ప్రభాకర్ రెడ్డి గృహ నిర్బంధం.. అనంతలో హైటెన్షన్!
- తిమ్మనచెరువు లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద కళ్యాణమండపం పనుల భూమి పూజకు జేసీ ఏర్పాట్లు
- జేసీ బయటకు వెళ్లకుండా ఇంటి ముందు మోహరించిన పోలీసులు
- టీడీపీ నేతలు, కార్యకర్తలు అక్కడికి రాకుండా బ్యారికేడ్ల ఏర్పాటు
అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి నివాసం వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. ప్రభాకర్ రెడ్డిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. పెద్దపప్పురు మండలం తిమ్మనచెరువు లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద కళ్యాణమండపం పనుల భూమి పూజకు జేసీ ఏర్పాట్లు చేశారు. దీంతో ఆయన ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా ఇంటి ముందు మరోసారి పోలీసులు మోహరించారు. జేసీ నివాసం వద్దకు టీడీపీ నేతలు, కార్యకర్తలు ఎవ్వరూ రాకుండా బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు.
ఇప్పటికే ఆలయ కమిటీ సిబ్బందితో పాటు సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం ఎండోమెంట్ పరిధిలోకి రాదంటూ హైకోర్టు తీర్పునిచ్చింది. దేవాలయం పరిధిలో అభివృద్ధి పనులు చేసుకోవచ్చంటూ ఆదేశాలు జారీ చేసింది. అయినా పోలీసులు తనను గృహనిర్బంధం చేయడంపై జేసీ వారిపై మండిపడుతున్నారు. ఆయన నివాసం వద్ద పోలీసుల మోహరింపుతో అనంతలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది.