Ajit Pawar: ‘మహా’ రాజకీయాల్లో మరో కుదుపు.. మంత్రి పదవి రేపు ఉంటుందో, ఊడుతుందోనన్న అజిత్ పవార్

Ajit Pawar Sensational Comments Days After No Show At Amit Shah Visit
  • ముంబైలో అమిత్ షా కార్యక్రమానికి అజిత్ పవార్ గైర్హాజరు
  • ముందస్తు కార్యక్రమాల వల్లేనన్న పవార్
  • ముసలం తప్పదంటున్న రాజకీయ నిపుణులు
చూస్తుంటే మహారాష్ట్ర రాజకీయాల్లో మళ్లీ ముసలం పుట్టినట్టే కనిపిస్తోంది. ఎన్సీపీని చీల్చి బీజేపీ సారథ్యంలోని ఏక్‌నాథ్ షిండే ప్రభుత్వంలో చేరి ఉపముఖ్యమంత్రి పదవి చేపట్టిన అజిత్ పవార్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన పదవి ఉంటుందో.. పోతుందోనని ఆవేదన వ్యక్తం చేశారు. ముంబైలో కేంద్ర హోంమంత్రి అమిత్ పర్యటనకు గైర్హాజరైన అజిత్ పవార్.. పూణెలోని బారామతిలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. తానిప్పుడు ఆర్థికశాఖ మంత్రిగా ఉన్నానని, కానీ రేపు ఆ పదవి ఉంటుందో? ఊడుతుందో? చెప్పలేనంటూ ఊహాగానాలను మరింత పెంచారు.

ముంబైలో అమిత్ షా కార్యక్రమానికి హాజరు కాకపోవడంపై మాట్లాడుతూ.. ముందస్తు కార్యక్రమాల వల్ల తాను హాజరుకాలేకపోతున్నట్టు షా కార్యాలయానికి సమాచారం అందించినట్టు తెలిపారు. గణేశుడి దర్శనం కోసం ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఇళ్లను అమిత్ షా సందర్శించారు.  కాగా, అజిత్ పవార్ వ్యాఖ్యలు రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. కూటమి నుంచి బయటకు వచ్చే అవకాశాలున్నాయని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే ‘మహా’ రాజకీయాల్లో మరో కుదుపు తప్పదన్నట్టే.
Ajit Pawar
NCP
BJP
Amit Shah
Eknath Shinde

More Telugu News