Elon Musk: టెస్లా రోబో యోగాసనాలు.. వీడియో ఇదిగో!
- యోగా చేస్తూ నమస్తే చెబుతున్న టెస్లా ఆప్టిమస్
- వస్తువులను క్రమ పద్ధతిలో సర్దేస్తున్న రోబో
- హ్యూమనాయిడ్ రోబోలో ప్రగతి సాధించామన్న మస్క్
ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ కు చెందిన టెస్లా కంపెనీ ఇటీవల ఓ హ్యూమనాయిడ్ రోబోను తయారుచేసింది. ఈ రోబో మనుషుల మాదిరిగానే యోగాసనాలు వేస్తుందని చెబుతూ టెస్లా కంపెనీ ఓ వీడియోను రిలీజ్ చేసింది. తమ అనుబంధ కంపెనీ ఎక్స్ (ట్విట్టర్) లో పోస్ట్ చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆప్టిమస్ గా వ్యవహరిస్తున్న ఈ రోబో యోగాసనాల భంగిమలను చేసి చూపిస్తోంది. తనకుతానుగా వస్తువులను గుర్తించి వాటిని ఓ క్రమ పద్ధతిలో సర్దుతోంది. మధ్యలో ఆటంకాలు కల్పించినా సరే తన పని నుంచి డైవర్ట్ కావడంలేదు. ఏమాత్రం పొరపాటు పడకుండా వస్తువులను సర్దిపెడుతోంది.
ఈ వీడియోపై టెస్లా అధినేత ఎలాన్ మస్క్ స్పందిస్తూ.. హ్యూమనాయిడ్ రోబో తయారీలో పురోగతి సాధించినట్లు తెలిపారు. అయితే, ఈ రోబోను ఎప్పుడు అందుబాటులోకి తీసుకొస్తారనే విషయంపై మస్క్ కానీ, టెస్లా కంపెనీ కానీ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. కాగా, సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియోపై నెటిజన్లు పాజిటివ్ గా స్పందిస్తున్నారు. టెస్లా కంపెనీ నుంచి వస్తున్న మరో అద్భుతమంటూ పొగుడుతున్నారు.